Yogi Adityanath: విక్టరీపై యూపీ సీఎం యోగి తొలి మాట ఇదే!
- స్పష్టమైన మెజారిటీ సాధించాం
- మోదీ నాయకత్వంలో బీజేపీకి అద్భుత విజయం
- ప్రజా తీర్పుతో విపక్షాల నోళ్లకు మూత
- యూపీ మరింత మేర అభివృద్ధి సాధిస్తుందన్న యోగి
ఉత్తర ప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల ఫలితాలు దాదాపుగా విడుదలయ్యాయి. ఇప్పటికే పంజాబ్, గోవా అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ముగియగా.. ఉత్తరాఖండ్ చివరి దశకు చేరుకుంది. ఇక ఉత్తరప్రదేశ్, మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ మరికాసేపట్లోనే ముగియనుంది.
అయితే ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో గెలుపు ఎవరిదన్న విషయం అయితే స్పష్టమైపోయింది. పంజాబ్‌లో ఆప్ విజయం సాధించగా.. మిగిలిన నాలుగు రాష్ట్రాలను బీజేపీ కైవసం చేసుకుంది. దేశంలోనే కీలక రాష్ట్రంగా పరిగణిస్తున్న ఉత్తరప్రదేశ్‌లో సరికొత్త రికార్డులు నమోదు చేస్తూ వరుసగా రెండో సారి బీజేపీ విజయం సాధించగా..సీఎంగా యోగి ఆదిత్యనాథ్ వరుసగా రెండో పర్యాయం పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.
ఈ సందర్భంగా యూపీ ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమైన నేపథ్యంలో యోగి ఆదిత్యనాథ్ పార్టీ కార్యకర్తలు, యూపీ ప్రజలను ఉద్దేశించి కాసేపటి క్రితం మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ.. "మోదీ నాయకత్వంలో బీజేపీ అద్భుత విజయం సాధించింది. మిత్రపక్షాలతో కలిసి పూర్తి మెజారిటీ సాధించాం. ఈవీఎంలు ట్యాంపర్ చేశారంటూ కొందరు దుష్ప్రచారం చేశారు. ప్రజలు ఇచ్చిన తీర్పుతో ఇక వాళ్ల నోళ్లు మూతపడతాయి. బీజేపీకి విజయం అందించిన ప్రజలకు ధన్యవాదాలు. మోదీ మార్గదర్శకత్వంలో యూపీ మరింత మేర అభివృద్ధి సాధిస్తుంది" అని వ్యాఖ్యానించారు.