Team India: ఐసీసీ వరల్డ్ కప్: టీమిండియా అమ్మాయిలకు ఓటమి... 62 పరుగులతో న్యూజిలాండ్ గెలుపు

Team India women lost to New Zealand in their second league match

  • 50 ఓవర్లలో 9 వికెట్లకు 260 పరుగులు చేసిన కివీస్ 
  • 46.4 ఓవర్లలో 198 పరుగులకు ఆలౌటైన భారత్
  • 71 పరుగులు చేసిన హర్మన్ ప్రీత్
  • మిథాలీ తప్పిదంతో మలుపు తిరిగిన మ్యాచ్

న్యూజిలాండ్ లో జరుగుతున్న ఐసీసీ ప్రపంచకప్ లో టీమిండియా అమ్మాయిలు పరాజయం చవిచూశారు. హామిల్టన్ లో ఆతిథ్య న్యూజిలాండ్ తో నేడు జరిగిన మ్యాచ్ లో భారత మహిళల జట్టు 62 పరుగుల తేడాతో ఓడింది. ఈ లీగ్ పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ మహిళల జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 260 పరుగులు చేయగా... లక్ష్యఛేదనలో భారత్ ఘోరంగా విఫలమైంది. 46.4 ఓవర్లలో 198 పరుగులకు ఆలౌటై ఓటమి చవిచూసింది. 

హర్మన్ ప్రీత్ కౌర్ 63 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 71 పరుగులు చేసింది. అయితే మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో ఓటమి తప్పలేదు. కెప్టెన్ మిథాలీ రాజ్ (31) స్టంపౌట్ కావడం మ్యాచ్ ను మలుపు తిప్పింది. ఓ దశలో భారత్ 50 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. మిథాలీ, హర్మన్ ప్రీత్ మెరుగైన భాగస్వామ్యంతో భారత్ కోలుకుంటుందన్న దశలో, అనవసరంగా ముందుకొచ్చిన మిథాలీ స్టంపౌట్ అయింది. న్యూజిలాండ్ బౌలర్లలో అమేలియా కెర్ 3, లియా తహుహు 3 వికెట్లతో భారత బ్యాటింగ్ లైనప్ ను దెబ్బతీశారు. 

టోర్నీలో టీమిండియా అమ్మాయిలు తమ తొలిమ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ ను ఓడించడం తెలిసిందే. ఇక టీమిండియా తన మూడో లీగ్ మ్యాచ్ ను ఈ నెల 12న వెస్టిండీస్ తో ఆడనుంది. వెస్టిండీస్ తో పోరు భారత్ కు సవాలు కానుంది. ఎందుకంటే వెస్టిండీస్ అమ్మాయిలు ఇప్పటివరకు తామాడిన రెండు మ్యాచ్ ల్లో నెగ్గి ఊపుమీదున్నారు. తొలుత న్యూజిలాండ్ ను ఓడించిన విండీస్ మహిళల జట్టు, తమ రెండో మ్యాచ్ లో బలమైన ఇంగ్లండ్ ను చిత్తుచేశారు.

  • Loading...

More Telugu News