Ukraine: పుతిన్ ను అడ్డుకోకుంటే.. భూమిపై సురక్షిత ప్రదేశం అనేదే ఉండదు: ఉక్రెయిన్ ప్రథమ మహిళ
- ఉక్రెయిన్ ప్రజల సామూహిక హననమే రష్యా స్పెషల్ ఆపరేషన్
- శరణార్థులతో నిండిపోయిన రహదారులు
- వాస్తవాలను ప్రపంచానికి చూపించాలి
- వివరాలతో మీడియాకు ఒలెన్ జెలెన్ స్కా లేఖ
రష్యా దాడులతో ఉక్రెయిన్ రోజురోజుకు తీవ్ర నష్టాన్ని చవిచూస్తోంది. 20 లక్షల మంది ఉక్రెయిన్ నుంచి వలసపోయారని అంచనా. ఈ క్రమంలో ఉక్రెయిన్ ప్రథమ మహిళ, ఆ దేశాధ్యక్షుడు జెలెన్ స్కీ భార్య ఒలెనా జెలెన్ స్కీ మీడియాను ఉద్దేశించి లేఖ రాశారు.
పుతిన్ ను అడ్డుకోకుంటే ఎవరికీ రక్షణ ఉండదన్నారు. ‘‘అణు యుద్ధం మొదలు పెడతానంటూ బెదిరిస్తున్న పుతిన్ ను మనం నిలువరించకపోతే ప్రపంచంలో సురక్షిత ప్రదేశం అంటూ మనకు ఉండదు’’ అని ఆమె భావోద్వేగంగా రాశారు.
రష్యా స్పెషల్ ఆపరేషన్ అన్నది.. ఉక్రెయిన్ ప్రజలను సామూహికంగా హత్య చేయడమేనన్నారు. పౌరులను తాము లక్ష్యంగా చేసుకోవడం లేదన్న రష్యా ప్రకటనలను తీవ్రంగా ఖండించారు. అందుకు పలు ఉదాహరణలను కూడా ఆమె తన లేఖలో ప్రస్తావించారు.
‘‘మనవరాలిని తాతయ్య కాపాడుదామని ప్రయత్నిస్తున్న తరుణంలోనే ఓక్ టిక్రా వీధుల్లో ఎనిమిదేళ్ల అలైస్ చనిపోయింది. కీవ్ కు చెందిన పోలినా తన తల్లిదండ్రులతో ఉన్న సమయంలో రష్యా బాంబులకు బలైపోయింది. 14 ఏళ్ల ఆర్సేనీ తలకు శిథిలాలు తగిలి మరణించింది’’ అని ఒలెనా పేర్కొన్నారు.
రష్యా దాడులతో ఎంతో మంది ప్రజలు తమ పిల్లలు, పెంపుడు జంతువులతో కలసి బాంబు షెల్టర్లలో, బేస్ మెంట్లలో రోజుల తరబడి తలదాచుకోవాల్సిన పరిస్థితిని ఆమె ప్రస్తావించారు. ధీన్ని భయానక వాస్తవంగా ఆమె అభివర్ణించారు. అత్యవసర వైద్య సాయం కూడా పొందలేని పరిస్థితులు నెలకొన్నట్టు చెప్పారు.
వేలాది మంది శరణార్థులతో రహదారులు నిండిపోయాయని.. అయిన వాళ్లకు దూరమై, ఓపిక లేని పరిస్థితుల్లో, గుండె బరువెక్కి వెళుతున్న తీరును తన పెన్నుతో వర్ణించారు. తమకు మానవతా సాయం అందిస్తున్న దేశాలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.
‘‘ఉక్రెయిన్ శాంతిని కోరుకుంటోంది. కానీ, ఉక్రెయిన్ తన సరిహద్దులను, తన గుర్తింపును కాపాడుకుంటుంది. మా గగనతలాన్ని నో ఫ్లైజోన్ గా ప్రకటించండి. యుద్ధాన్ని మేము ఎదుర్కోగలం’’ అని ఆమె పేర్కొన్నారు. ఉక్రెయిన్ లో ఏమి జరుగుతోందన్న వాస్తవాలను ప్రపంచానికి చూపించాలని మీడియాను కోరారు.