KCR: అప్పట్లో జోకర్లతో సినిమాల్లో తెలంగాణ భాష మాట్లాడించేవారు: అసెంబ్లీలో కేసీఆర్
- ఇప్పుడు తెలుగు సినిమాలో హీరోలు మన యాసలో మాట్లాడుతున్నారు
- తెలంగాణ భాష మాట్లాడితేనే సినిమాకు మంచి ఆదరణ వస్తోంది
- తెలంగాణ సంస్కృతి, బతుకమ్మ వైభవంగా వెలుగొందుతున్నాయి
- సమ్మక్క సారలమ్మ వంటి పండుగలు అధికారికంగా జరుపుతున్నాం
- ఇంకా కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడుతున్నాం
తెలంగాణ అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రసంగిస్తున్నారు. తెలంగాణలో ఇప్పుడు అన్ని వర్గాల వారికి న్యాయం జరుగుతోందని, సంస్కృతిని కాపాడుకుంటున్నామని చెప్పారు. 'ఒకప్పుడు జోకర్లతో సినిమాల్లో తెలంగాణ భాష మాట్లాడించేవారు. ఇప్పుడు తెలుగు సినిమాలో హీరోలు తెలంగాణ భాష మాట్లాడితేనే ఆ సినిమాకు మంచి ఆదరణ వస్తోంది. తెలంగాణ సంస్కృతి, బతుకమ్మ, పోచమ్మ తల్లికి పూజలు వంటి అన్ని అంశాలు వైభవంగా వెలుగొందుతున్నాయి. సమ్మక్క సారలమ్మ వంటి పండుగలు అధికారికంగా జరుపుతున్నాం. ఇంకా కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడుతున్నాం' అని కేసీఆర్ అన్నారు.
2014కి ముందు తెలంగాణ సమాజానికి అన్యాయం జరిగిందని చెప్పారు. తెలంగాణ ఏర్పాటు దేశ చరిత్రలో ప్రత్యేక ఘట్టమని తెలిపారు. హైదరాబాద్ కొంత కాలం దేశంగా పరిగణించబడిందని అన్నారు. తెలంగాణలో గతంలో ఆకలి చావులు ఉండేవని చెప్పారు. తమకు రావాల్సిన ఉద్యోగాలు రావట్లేదని యువత బాధపడ్డారని అన్నారు.
రైతులు కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. తెలంగాణకు ఇలా దశాబ్దాలుగా అన్యాయం జరిగిందని చెప్పారు. సమైక్య రాష్ట్ర పాలనలో ఇక తెలంగాణకు న్యాయం జరగదని గ్రహించామని అన్నారు. సుదీర్ఘమైన పోరాటం చేశామని చివరకు అనుకున్నది సాధించామని తెలిపారు.
'తెలంగాణ తనను తాను పునఃదర్శించుకోవాలి. తెలంగాణ తనను తాను ఆవిష్కరించుకోవాలి. కొంతమంది కేవలం రాజకీయాల కోసం ఎన్నో వ్యాఖ్యలు చేస్తున్నారు. పనికిమాలిన వారు స్పీకర్‌పై కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. నేను చాలా సార్లు చెప్పాను. మళ్లీ ఇంకోసారి చెబుతున్నాను. వేరే పార్టీలకు రాజకీయాలంటే ఒక గేమ్. కానీ, టీఆర్ఎస్ పార్టీకి రాజకీయాలంటే ఒక టాస్క్. టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఎన్నో లాఠీ దెబ్బలు తిన్నారు.. జైళ్లకు వెళ్లారు.
అయినా పోరాడి తెలంగాణ సాధించాం. మా లక్ష్యం దెబ్బతినకూడదని పోరాడాం. ఇప్పుడు బాధ్యతగా ముందుకు వెళ్తున్నాం. నీళ్లు, నిధులు, నియామకాలు వంటి పలు అంశాల కోసం గతంలోనూ పోరాడాం. ఇప్పుడు తెలంగాణలో పంటలు బాగా పండుతున్నాయి. మేము ఉద్యమ సమయంలో ఏం చేశామో, ఇప్పుడు ఎంత గొప్పగా పరిపాలిస్తున్నామో ప్రజలకు తెలుసు. రాజకీయాలంటే మాకు పవిత్రమైన కర్తవ్యం' అని కేసీఆర్ అన్నారు.