Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గందరగోళం.. టీడీపీ సభ్యుల నినాదాలు
- రాజ్యాంగ వ్యవస్థను కాపాడలేని గవర్నర్ అంటూ టీడీపీ నినాదాలు
- గవర్నర్ గో బ్యాక్ అంటూ నినాదాలు
- బడ్జెట్ ప్రతులను చించేసిన టీడీపీ సభ్యులు
- గందరగోళం మధ్యే గవర్నర్ ప్రసంగం
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగిస్తున్నారు. అయితే, టీడీపీ సభ్యుల నినాదాలతో అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. రాజ్యాంగ వ్యవస్థను కాపాడలేని గవర్నర్ గో బ్యాక్ అంటూ టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. బడ్జెట్ ప్రతులను చించేశారు. గందరగోళం మధ్యే గవర్నర్ ప్రసంగించారు.
పాలన వికేంద్రీకరణతోనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని గవర్నర్ చెప్పారు. ఏపీ అభివృద్ధి పథంలో నడుస్తోందని అన్నారు. గత మూడేళ్లుగా వికేంద్రీకరణ, సమ్మిళిత పాలన ఉండేలా ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభమవుతుందని అన్నారు.
కొత్త జిల్లాలతో ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని చెప్పారు. కరోనాతో దేశం, రాష్ట్రం ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నాయని తెలిపారు. ఏపీపై కరోనా తీవ్ర ప్రభావం చూపిందని చెప్పారు. ప్రభుత్వానికి ఉద్యోగులు మూల స్తంభాలని అన్నారు. అందుకే ఉద్యోగుల వయోపరిమితిని 60 నుంచి 62 ఏళ్లకు పెంచామని తెలిపారు.
విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో రాష్ట్రం మెరుగైన అభివృద్ధి సాధిస్తోందని గవర్నర్ తెలిపారు. పాలన కింది స్థాయి వరకు విస్తరించేలా గ్రామ సచివాలయాలు పని చేస్తున్నాయని కొనియాడారు.