Ukraine Boy: 11 ఏళ్ల బాలుడు.. యుద్ధభూమిలో ఒంటరిగా 1,000 కిలోమీటర్ల ప్రయాణం!

11 Year Old Ukraine Boy Travels 1000 Km Alone To Get To Safety

  • ఉక్రెయిన్ బాలుడి హీరోయిజం
  • అభినందించిన ఆ దేశ హోం మంత్రి
  • సరిహద్దు దాటి స్లోవేకియాలోని బంధువు వద్దకు చేరిక
  • సాయం అందించిన సరిహద్దు దళాలు

11 ఏళ్ల వయసులో ఒంటరిగా ఎక్కడికైనా వెళ్లి రావాలంటే వారిలో అంత ధైర్యం కనిపించదు. కానీ, బాంబులు, క్షిపణులు, తుపాకులు గర్జిస్తూ, ఆర్తనాదాలు వినిపించే యుద్ధ భూమిలో ఒంటరిగా 1,000 కిలోమీటర్లు  ప్రయాణం చేయడం అంటే మామూలు విషయం కానే కాదు. ఆ బాలుడి గుండె గట్టిదనే చెప్పుకోవాలి. ఉక్రెయిన్ లోని జపోరిజియా ప్రాంతానికి చెందిన సదరు బాలుడు అలాంటి ధైర్యాన్నే చాటి.. ఇప్పుడు హీరోగా మారిపోయాడు.

బాలుడిని ఉక్రెయిన్ హోం శాఖ మంత్రి ‘ద బిగ్గెస్ట్ హీరో ఆఫ్ లాస్ట్ నైట్’ పేరుతో అభివర్ణించారు. ఒక షోల్డర్ బ్యాగులో టెలిఫోన్ నంబర్ రాసిన పేపర్, పాస్ పోర్ట్, తినడానికి ఆహారం ఉంచి.. దాన్ని బాలుడి భుజానికి తగిలించి ఇక వెళ్లు అంటూ కన్నతల్లి గుండె ధైర్యం చెప్పింది. తల్లి తన సందేశంతో కూడిన పేపర్ ను కూడా బ్యాగులో పెట్టింది. రైలు ఎక్కి సరిహద్దుకు చేరుకున్న బాలుడు.. స్లోవేకియాలోని బంధువును చేరుకున్నాడు. 

ఆ బాలుడు తన చిరునవ్వుతో సరిహద్దు గార్డుల మనసులూ గెలుచుకున్నాడు. ‘అతడి చిరునవ్వు, నిర్భయత్వం, అంకిత భావం అన్నీ నిజమైన హీరోకి నిదర్శనాలు’’ అంటూ ఉక్రెయిన్ హోంమంత్రి ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టారు. సరిహద్దు దళాలు బాలుడి దగ్గరున్న ఫోన్ నంబర్ కు కాల్ చేసి అతడి బంధువుకు సమాచారం ఇచ్చారు. బ్రాటిసాల్వ నుంచి వచ్చిన బంధువుకు అతడ్ని అప్పగించారు. 

స్లొవేకియా ప్రభుత్వానికి బాలుడి తల్లి ధన్యవాదాలు చెప్పుకుంది. బాలుడి తల్లిదండ్రులు ఉక్రెయిన్ లోనే ఉండిపోయారు. వారి సమీప బంధువు అనారోగ్యం కారణంగా వారు ఉక్రెయిన్ ను విడిచి వచ్చే పరిస్థితి ప్రస్తుతానికి లేకపోవడంతో, తమ కలల రూపమైన వారసుడు అయినా క్షేమంగా ఉంటే చాలని తలచి అలా చేశారు. 

  • Loading...

More Telugu News