Vladimir Putin: ఉక్రెయిన్ పై సైనికచర్య ఎందుకంటే...: దాడిని మరోసారి సమర్థించుకున్న పుతిన్
- ఉక్రెయిన్ పై కొనసాగుతున్న రష్యా దాడులు
- డాన్ బాస్ ప్రజలను ఉక్రెయిన్ అణచివేసిందన్న పుతిన్
- ప్రస్తుత పరిస్థితికి ఉక్రెయిన్ ప్రభుత్వ పెద్దలే కారణమని ఆరోపణ
ఉక్రెయిన్ పై రష్యా బలగాల దాడులను యావత్ ప్రపంచం తీవ్రంగా గర్హిస్తున్నప్పటికీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాత్రం మరోసారి సమర్థించుకున్నారు. ఉక్రెయిన్ పై దాడి కఠిన నిర్ణయం అని పేర్కొన్నారు. డాన్ బాస్ ప్రజల పట్ల ఉక్రెయిన్ అణచివేతకు పాల్పడిందని ఆరోపించారు. అందుకే తాము సైనికచర్యకు దిగాల్సి వచ్చిందని పుతిన్ స్పష్టం చేశారు. 2014లో సైనిక తిరుగుబాటు రాజ్యాంగ విరుద్ధమని అన్నారు.
ప్రస్తుత పరిస్థితులకు ఉక్రెయిన్ ప్రభుత్వ పెద్దలదే పూర్తి బాధ్యత అని ఉద్ఘాటించారు. ఉక్రెయిన్ నేతలు ప్రస్తుత చర్యలను కొనసాగించదలుచుకుంటే ఉక్రెయిన్ స్వతంత్ర దేశ హోదా ప్రమాదంలో పడినట్టేనని పేర్కొన్నారు.