Telangana: గవర్నర్ ప్రసంగం లేకుంటే సభ్యుల హక్కులు హరించినట్టే: తమిళిసై
- గవర్నర్ ప్రసంగం లేకుండానే తెలంగాణ బడ్జెట్ సమావేశాలు
- అసంతృప్తిని వ్యక్తం చేసిన గవర్నర్ తమిళిసై
- ప్రభుత్వ పనితీరును పరిశీలించాల్సిందేనని వ్యాఖ్య
- రాజ్ భవన్ నుంచి ప్రకటన విడుదల
మరో రెండు రోజుల్లో తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలు కాబోతున్నాయి. సోమవారం ఉదయమే ప్రారంభం కానున్న ఈ సమావేశాల్లో సంప్రదాయానికి విరుద్ధంగా గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు తెలంగాణ అసెంబ్లీ సెక్రటేరియట్ ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసింది. గవర్నర్ ప్రసంగం లేకుండా సమావేశాలను ప్రారంభిస్తున్న తీరుపై ఇప్పటికే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇలాంటి నేపథ్యంలో గవర్నర్ తమిళిసై కార్యాలయం కూడా ఈ తరహా కొత్త సంప్రదాయంపై స్పందించింది. ఈ మేరకు శనివారం సాయంత్రం రాజ్ భవన్ ఓ ప్రకటన విడుదల చేసింది.
గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలను ప్రారంభిస్తున్న తెలంగాణ ప్రభుత్వ వైఖరిపై గవర్నర్ తమిళసై సౌందరరాజన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగం లేకుండానే సభ నిర్వహించాలని నిర్ణయించిన ప్రస్తుత ప్రభుత్వ పనితీరును పరిశీలించాల్సి ఉందని రాజ్ భవన్ విడుదల చేసిన ఆ ప్రకటనలో ఆమె పేర్కొన్నారు.
గవర్నర్ ప్రసంగం లేకుండా చేస్తే సభ్యులు చర్చించే హక్కును కోల్పోయినట్టేనని ఆమె అభిప్రాయపడ్డారు. సాంకేతికంగా గవర్నర్ ప్రసంగం తప్పనిసరి కాకపోవచ్చని పేర్కొన్న ఆమె.. గవర్నర్ ప్రసంగం లేకపోయినప్పటికీ బడ్జెట్ సమర్పణను స్వాగతిస్తున్నట్లు తెలిపారు.