Telangana: బంగారు తెలంగాణ కాదు.. తాగుబోతుల తెలంగాణ‌: కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి ఫైర్‌

komatireddy rajahopal reddy comments on kcr

  • విప‌క్ష ఎమ్మెల్యేల నియోజ‌క‌వ‌ర్గాల‌కు నిధులివ్వ‌ట్లేదు
  • విప‌క్ష నేత‌లు అన్న మాటే లేకుండా చేస్తున్నారు
  • మ‌ద్యం, బెల్టు షాపుల‌నూ పెంచేశారు
  • కేసీఆర్‌ని చూసి అంతా నవ్వుతున్నారన్న కోమ‌టిరెడ్డి 

తెలంగాణ‌ను ప్ర‌త్యేక రాష్ట్రంగా సాధించుకున్న త‌ర్వాత రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ‌గా మారుస్తామంటూ జ‌నాల్లోకి వెళ్లిన టీఆర్ఎస్ వ‌రుస‌గా రెండు సార్లు ప్ర‌భుత్వాల‌ను ఏర్పాటు చేయ‌గ‌లిగింది. ఇక మూడోసారి కూడా గెలుపు సాధించాల‌న్న దిశ‌గా ఆ పార్టీ క‌దులుతోంది. 

అదే స‌మ‌యంలో టీఆర్ఎస్‌ను నిలువ‌రించే దిశ‌గా ఓ వైపు బీజేపీ తీవ్ర య‌త్నాలు చేస్తుంటే.. మ‌రోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా అధికార పార్టీపై త‌న‌దైన శైలిలో విరుచుకుప‌డుతోంది. టీఆర్ఎస్ ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌తో పాటు సీఎం కేసీఆర్‌పై వ్య‌క్తిగ‌తంగానే ఘాటు విమ‌ర్శలు గుప్పిస్తోంది. 

అభివృద్ధి అంటే కేసీఆర్‌ నియోజకవర్గానికి 6 వరసల రోడ్లు వేయ‌డం కాద‌ని, రాష్ట్రంలోని అన్ని నియోజ‌క‌వర్గాల‌కు ఈ త‌ర‌హా సౌక‌ర్యాలు క‌ల్పించాల‌ని కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌, న‌ల్ల‌గొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్‌ ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతలు లేకుండా చేస్తున్నార‌ని ఆయ‌న ఆరోపించారు. 

విప‌క్ష‌ పార్టీ ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వకుండా అభివృద్ధికి అడ్డుపడుతున్నారని ఆయన మండిపడ్డారు. త‌న నియోజకవర్గంలో కరోనా సమయంలో సుశీలమ్మ ఫౌండేషన్ తరపున రూ.5 కోట్ల నిత్యావసర సరుకులు పంచానని తెలిపారు. బంగారు తెలంగాణ చేస్తానని ప్ర‌జ‌ల‌ను న‌మ్మ‌బ‌లికిన కేసీఆర్‌.. మద్యం, బెల్ట్ షాపులు పెంచి తాగుబోతుల తెలంగాణ చేశార‌ని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు కొత్తగా దేశాన్ని ఉద్ధరిస్తానంటూ ఢిల్లీకి వెళ్తున్న కేసీఆర్‌ని చూసి అంతా నవ్వుతున్నారని రాజ‌గోపాల్ రెడ్డి ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News