Russia: ఉక్రెయిన్ అణు ప్లాంట్ పై రష్యా దాడి.. భారీగా పెరిగిన కమాడిటీస్ ధరలు
- 6.6 శాతం పెరిగిన గోధుమ ధరలు
- అల్యూమినియం ధరల్లో 3.6 శాతం పెరుగుదల
- ఇనుప ఖనిజంపై 16%, గ్యాస్ పై 4.3%
ఉక్రెయిన్ పై రష్యా దాడులతో ప్రపంచ మార్కెట్లు అతలాకుతలమవుతున్నాయి. శుక్రవారం అణు రియాక్టర్ పై జరిగిన దాడితో ప్రపంచవ్యాప్తంగా కమాడిటీస్ ధరలు భారీగా పెరిగిపోయాయి. ముడి చమురు, అల్యూమినియం, గోధుమల వంటి వాటి రేట్లు పెరిగాయి. చమురు సంక్షోభం నెలకొన్న కొన్ని రోజులకే కమాడిటీస్ ధరలు.. ఈ వారంలోనే అత్యధికంగా నమోదయ్యాయి. 1974 నుంచి ఇదే అత్యధిక పెరుగుదల అని నిపుణులు అంటున్నారు.
ఉక్రెయిన్ పై దాడుల నేపథ్యంలో ప్రపంచ దేశాలు, వ్యాపార సంస్థలు రష్యాతో వాణిజ్యానికి దూరంగా ఉంటున్నాయి. ఆ దేశాన్ని ఒంటరిని చేశాయి. పేమెంట్లు నిలిపేయడంతో చెల్లింపుల్లో కష్టాల వల్ల బ్యాంకులు, షిప్ ఓనర్లు బిజినెస్ ఆపారు. ఆ ప్రాంతం నుంచి వస్తున్న బుకింగ్ లను షిప్ ఓనర్లు తీసుకోవడం లేదు. దీంతో అక్కడి నుంచి వచ్చే దిగుమతులపై ఆధారపడే దేశాలపైనా ఎఫెక్ట్ పడుతోంది. ఫలితంగా చమురు సహా కమాడిటీస్ ధరలు పెరుగుతున్నట్టు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే కొనసాగితే ప్రపంచ దేశాల ద్రవ్యోల్బణం తీవ్రస్థాయికి చేరే ప్రమాదం ఉంటుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
ప్రపంచ దేశాలకు ఇంధన భద్రత ప్రమాదంలో పడుతుందని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ హెచ్చరించింది. అమెరికాతో పాటు పెద్ద ఆర్థిక వ్యవస్థలున్న దేశాలు ఎమర్జెన్సీ ఆయిల్ రిజర్వ్ లను బయటకు తీయకపోవడంతో సరఫరాలు తగ్గిపోయాయని, దాని ప్రభావం ధరలపై పడిందని చెప్పింది. ఈ ఏడాది ముగిసే నాటికి బ్యారెల్ ముడి చమురు ధర 185 డాలర్లకు చేరే ప్రమాదముందని జేపీ మోర్గాన్ చేజ్ అండ్ కంపెనీ ప్రకటించింది. ఇవాళ బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ 114 డాలర్లుగా ఉంది.
కాగా, గోధుమల ధర కూడా భారీగా పెరిగింది. అన్ని వంటకాల్లోనూ విరివిగా వాడే గోధుమల సరఫరా ప్రపంచంలోని పావు వంతు దేశాలకు తగ్గిపోయిందని చెబుతున్నారు. దీంతో షికాగోలో ఒక బుషెల్ (25 కిలోల) గోధుమల ధర 6.6 శాతం పెరిగి.. 12.09 డాలర్లు (సుమారు రూ.921)గా ఉంది. 2008 నుంచి గోధుమల ధర భారీగా పెరగడం ఇదే తొలిసారని చెబుతున్నారు.
ఇటు లోహాల ధరలు భారీగా పెరిగాయి. అల్యూమినియం ధరలు 3.6 శాతం పెరిగాయి. ప్రస్తుతం లండన్ మెటల్ ఎక్స్ చేంజ్ వద్ద టన్ను అల్యూమినియం ధర 3,850 డాలర్లు (సుమారు రూ.2.93 లక్షలు)గా ఉంది. రాగి ధరలు కూడా గరిష్ఠ స్థాయికి చేరాయి. గ్యాస్ ధరలు 4.3 శాతం మేర పెరిగాయి. సింగపూర్ లోని ఇనుప ఖనిజం ఎక్స్ చేంజ్ 16 శాతం దాకా పెరిగింది. ఈ మూడు నెలల్లోనే ఈ పెరుగుదల అధికం కావడం గమనార్హం. కాగా, ధరల పెరుగుదల వల్ల ప్రపంచ ద్రవ్యోల్బణం పెరిగి వృద్ధి మందగించే అవకాశాలున్నాయని ఆందోళన వ్యక్తమవుతోంది.