prostate cancer: ప్రోస్టేట్ కేన్సర్ ను గుర్తించే అల్ట్రా సౌండ్ స్కాన్ !
- లండన్ శాస్త్రవేత్తల పరిశోధన
- కేవలం 4 శాతం కేసుల్లోనే గుర్తించలేకపోవచ్చు
- అల్ట్రాసౌండ్ తో సమయం, డబ్బు ఆదా
కేన్సర్ ను ముందుగా గుర్తిస్తే ప్రాణాపాయం తప్పుతుంది. తొలి రెండు దశల్లో గుర్తిస్తే మహమ్మారి నుంచి ప్రాణాలతో బయట పడే అవకాశాలు మెరుగ్గా ఉంటాయని ఇప్పటి వరకు ఉన్న అనుభవాలు చెబుతున్నాయి. అయితే, చాలా కేసుల్లో మూడు, నాలుగో దశల్లోనే కేన్సర్ బయటపడుతుంటుంది. కేన్సర్ ను సులభంగా గుర్తించే విధానం కోసం ఎదురు చూస్తున్న వారికి శాస్త్రవేత్తల తాజా పరిశోధన రూపంలో సంతోషకర విషయాన్ని తెలియజేశారు.
బయాప్సీ, ఎంఆర్ఐ ద్వారా కేన్సర్ ను గుర్తించొచ్చు. ఇవి ఖరీదైన పరీక్షలు, కొంచెం సమయం తీసుకునేవి. అందరికీ తెలిసిన సులభమైన అల్ట్రాసౌండ్ స్కాన్ తో ప్రోస్టేట్ కేన్సర్ ను గుర్తించొచ్చని ఇంపీరియల్ కాలేజీ లండన్, యూనివర్సిటీ కాలేజీ లండన్ పరిశోధకులు చెబుతున్నారు. నూతన రకం అల్ట్రా సౌండ్ కచ్చితత్వంతో ప్రోస్టేట్ కేన్సర్ ను గుర్తిస్తుందని 370 మంది పురుషులపై నిర్వహించిన పరిశోధన ద్వారా వీరు తెలుసుకున్నారు.
కేవలం 4.3 శాతం సందర్భాల్లోనే ప్రోస్టేట్ కేన్సర్ ను అల్ట్రా సౌండ్ గుర్తించలేకపోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అల్ట్రాసౌండ్ స్కాన్ కేవలం 10 నిమిషాల్లోనే చేయవచ్చు. చార్జీ కూడా రూ.500-1000 మధ్యే ఉంటుంది.