Felicity Ace: ఆ నౌక మునిగిపోయింది.. కాలిబూడిదైన కార్ల విలువ 400 మిలియన్ డాలర్లు!
- రెండు వారాలపాటు మండి మునిగిన భారీ రవాణా నౌక
- నౌకలో దాదాపు 4 వేల ఖరీదైన కార్లు
- నౌకలోని 22 మంది సిబ్బందిని అప్పుడే రక్షించిన వైనం
మీకు గుర్తుండే ఉంటుంది.. పోర్షే, బెంట్లీ, ఆడీ, లంబోర్గిని వంటి 4,000 ఖరీదైన కార్లతో జర్మనీ నుంచి బయలుదేరిన ఓ భారీ సరుకు రవాణా నౌక ‘ఫెలిసిటీ ఏస్’కు జరిగిన అగ్ని ప్రమాదం గురించి. ఫిబ్రవరి 23న అమెరికాలోని డెవిస్‌విల్లే తీరాన్ని చేరుకోవాల్సి ఉండగా, అట్లాంటిక్ మహాసముద్రంలో ప్రయాణిస్తున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
ఆ సమయంలో నౌక పోర్చుగల్‌కు చెందిన టెరాసిరీ ద్వీపానికి 200 మైళ్ల దూరంలో ఉంది. మూడు ఫుట్‌బాల్ స్టేడియాల పరిమాణంలో ఉన్న ఈ నౌకలో అంటుకున్న మంటలను అదుపు చేసేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అయితే, నౌకలోని 22 మందిని మాత్రం కాపాడగలిగారు. రెండువారాలపాటు మండిన ఈ నౌక నిన్న సముద్రంలో మునిగిపోయింది. నౌకలో కాలి బూడిదైన కార్ల విలువ సుమారు 400 మిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా.