Russia: డబ్బు ఎక్కడికక్కడ ఫ్రీజ్.. రష్యాపై ‘స్విఫ్ట్’ ఆంక్షలను పెట్టిన అమెరికా మిత్ర దేశాలు.. విదేశాలపైనా ఎఫెక్ట్
- డాలర్లు మార్చకుండా ఆంక్షలు
- అంతర్జాతీయ లావాదేవీలు నిర్వహించకుండా చర్యలు
- విదేశీ ఆస్తుల అమ్మకానికీ ఇబ్బందులే
ఉక్రెయిన్ పై యుద్ధానికి కాలుదువ్విన నేపథ్యంలో రష్యాపై అమెరికా, బ్రిటన్, కెనడా, యూరప్ దేశాలు మరోసారి ఆంక్షల కత్తిని దూశాయి. ఈసారి అత్యంత కఠినమైన ఆంక్షలను విధించాయి. అంతర్జాతీయ ఆర్థిక చట్రం నుంచి రష్యాను తప్పించి ఒంటరిని చేశాయి. అంతర్జాతీయ లావాదేవీలను నిర్వహించడానికి వీల్లేకుండా రష్యా బ్యాంకులపై ‘స్విఫ్ట్ (సొసైటీ ఫర్ వరల్డ్ వైడ్ ఇంటర్ బ్యాంక్ ఫైనాన్షియల్ టెలీకమ్యూనికేషన్స్)’ ఆంక్షలను విధించాయి.
‘‘ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం అంటే.. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో పెట్టుకున్న అంతర్జాతీయ నిబంధనల మీద రష్యా యుద్ధం చేసినట్టే. ఈ యుద్ధం భారీ తప్పు అని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలుసుకునేలా చేస్తాం. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ నుంచి రష్యాను ఒంటరిని చేస్తున్నాం. రాబోయే రోజుల్లో మరింత కఠినంగా ఉంటాం’’ అని ఆయా దేశాలు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి.
వీలైనంత త్వరగా ఈ చర్యలను అమలు చేస్తామని స్విఫ్ట్ ఇంటర్నేషనల్ పేమెంట్స్ వ్యవస్థ ప్రకటించింది. ఈ చర్యల పరిధిలోకి వచ్చే సంస్థలను గుర్తిస్తున్నామని తెలిపింది. ప్రస్తుతం రష్యా వద్ద 60 వేల కోట్ల డాలర్ల విలువైన ఆర్థిక రిజర్వ్స్ ఉన్నాయి. వాటిని రష్యా కరెన్సీగా మార్చేందుకు సెంట్రల్ బ్యాంకు ప్రయత్నించకుండా ఉండేందుకే స్విఫ్ట్ ఆంక్షలను పెట్టినట్టు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. విదేశీ ఆస్తులనూ విక్రయించకుండా ఆంక్షలు అడ్డుకుంటాయని అంటున్నారు. విదేశాల్లోని రష్యా రిజర్వులనూ స్తంభింపజేయొచ్చని చెబుతున్నారు.
ఈ ఆంక్షల వల్ల రష్యాతో పాటు విదేశాలపైనా ప్రభావం పడనుంది. చమురు, గ్యాస్ సొమ్మే రష్యా ఆదాయంలో 40 శాతం దాకా ఉంటుంది. దీంతో భారీగా రష్యా ఆదాయానికి గండి పడే అవకాశం ఉంది. విదేశాలు రష్యాకు ఎగుమతి చేసే వస్తువులకు సంబంధించిన సొమ్మును రాబట్టుకోవడమూ కష్టమే అవుతుంది. ఇటు చమురు, సహజ వాయువును రష్యా నుంచి దిగుమతి చేసుకునే దేశాలపైనా దాని ప్రభావం పడనుంది.
కాగా, అన్ని దేశాల సహకారంతో రష్యాపై స్విఫ్ట్ ఆంక్షలను విధించామని ఐరోపా సమాఖ్య చీఫ్ ఉర్సులా వాండర్ లియర్ చెప్పారు. ప్రస్తుతం చాలా వరకు బ్యాంకులను అంతర్జాతీయ లావాదేవీల పరిధి నుంచి తప్పించామన్నారు. దాని వల్ల ప్రపంచమంతటా రష్యా ఆర్థిక కార్యకలాపాలు మందగిస్తాయని, రష్యా ఎగుమతులు, దిగుమతులు తగ్గిపోయి ప్రభావం తీవ్రంగా ఉంటుందని చెప్పారు. రష్యా సెంట్రల్ బ్యాంకు ఆస్తులను ఫ్రీజ్ చేస్తామన్నారు. తద్వారా రష్యా లావాదేవీలన్నింటినీ ఫ్రీజ్ చేయడానికి వీలుంటుందన్నారు.