USA: యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ కు అమెరికా భారీ సాయం
- 600 మిలియన్ డాలర్ల సాయాన్ని అందిస్తున్నట్టు అమెరికా ప్రకటన
- తక్షణ సైనిక అవసరాలకు వినియోగించుకోవచ్చన్న అమెరికా
- అన్ని విధాలా సాయం అందిస్తామని ఇప్పటికే ప్రకటించిన యూఎస్
ఉక్రెయిన్ రాజధాని కీవ్ ను స్వాధీనం చేసుకునే దిశగా రష్యా బలగాలు వేగంగా అడుగులు వేస్తున్నాయి. కీవ్ లోని అధ్యక్ష భవనాన్ని కూడా బలగాలు చుట్టుముట్టాయి. మరోవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు కీవ్ వీధుల్లో తిరుగుతూ ప్రజల్లో స్ఫూర్తిని నింపే ప్రయత్నం చేస్తున్నారు. తాను కీవ్ లోనే ఉన్నానని, ఇక్కడే ఉండి పోరాడుతానంటూ వీడియోలు విడుదల చేశారు. తమకు ఆయుధాలు కావాలని కోరారు.
మరోవైపు ఉక్రెయిన్ కు అమెరికా భారీగా ఆర్థిక సాయాన్ని అందించింది. 600 మిలియన్ డాలర్ల సాయాన్ని అందిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు బైడెన్ ప్రకటించారు. ఈ మొత్తాన్ని ఉక్రెయిన్ తక్షణ సైనిక అవసరాల కోసం వినియోగించుకోవచ్చని చెప్పారు. ఉక్రెయిన్ కు అన్ని విధాలా అండగా ఉంటామని ఇప్పటికే అమెరికా ప్రకటించింది. రష్యాపై ఆంక్షలు విధించింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీని సురక్షిత ప్రాంతానికి తరలిస్తామని ఆఫర్ ఇచ్చింది. అయితే ఈ ఆఫర్ ను ఆయన తిరస్కరించారు.