Ukraine: కీవ్ వీధుల్లో భీకర పోరు.. ఆయుధాలు వీడే ప్రసక్తే లేదన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ

War Reaches Kyiv Streets Warns Ukraine Interior Ministry

  • ప్రజలుండే అపార్ట్ మెంట్లపై రష్యా దాడులు
  • ఎంతమంది చనిపోయారన్నదానిపై లేని క్లారిటీ
  • ప్రజలు బయటకు రావొద్దని హోం శాఖ సూచనలు
  • సత్యమే తమ ఆయుధమన్న జెలెన్ స్కీ

ఉక్రెయిన్ రాజధాని కీవ్ వీధుల్లో భీకరపోరు సాగుతోంది. రాజధాని నగరంలోకి రష్యా సైన్యం చొచ్చుకొచ్చేసింది. వారిని ఉక్రెయిన్ సైనికులు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు. అయితే, రష్యా బలగాలు ప్రజలు నివసించే అపార్ట్ మెంట్ బిల్డింగులపై రాకెట్లతో విరుచుకుపడుతున్నాయి. ఇవాళ ఉదయం కీవ్ రెండో విమానాశ్రయానికి సమీపంలో ఉన్న ఓ భారీ భవంతిపై రాకెట్ దాడి చేశాయి. 

దాడితో బిల్డింగ్ పదో అంతస్తులో భారీగా మంటలు చెలరేగాయి. కొన్ని అపార్ట్ మెంట్ యూనిట్ల బయటి గోడలు కుప్పకూలిపోయాయి. ఎమర్జెన్సీ దళాలు అక్కడకు చేరుకున్నాయి. సహాయ చర్యలు చేపట్టి.. స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎంత మంది చనిపోయారన్నదానిపై స్పష్టత లేదు. 

ఈ విషయానికి సంబంధించి ఆ దేశ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా ట్విట్టర్ లో ఫొటో పోస్ట్ చేశారు. తమ ప్రశాంతమైన కీవ్ నగరం మరోసారి రష్యా దాడులతో దద్దరిల్లిందని, ప్రజల ఇళ్లపై రష్యా సైనికులు రాకెట్లతో దాడి చేస్తున్నారని ఆరోపించారు. ప్రపంచం మొత్తం రష్యాను ఒంటరిని చేయాలంటూ ఆయన విజ్ఞప్తి చేశారు. ఆ దేశ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమయ్యేలా ఆంక్షలు విధించాలని కోరారు. 

ఇటు ఉక్రెయిన్ హోం శాఖ కూడా దానిపై హెచ్చరికలు జారీ చేసింది. భీకర పోరు జరుగుతోందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హోం శాఖ ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టింది. ‘‘కీవ్ వీధుల్లో భీకర పోరు జరుగుతోంది. అందరూ శాంతంగా, జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా షెల్టర్లలో ఉండి ఉంటే ఇప్పుడే బయటకు రావొద్దు. ఇంట్లో ఉంటే.. కిటికీల దగ్గరకు వెళ్లకండి. బాల్కనీల్లో ఉండకండి. గాయాల నుంచి రక్షించుకునే చోట ఉండండి. బాత్రూంలు, బెడ్రూంలలో దాక్కోండి. ఒకవేళ సైరన్లు వినిపిస్తే వెంటనే దగ్గర్లోని షెల్టర్ కు వెళ్లండి’’ అంటూ ఆ పోస్ట్ లో పేర్కొంది. 

ఆయుధాలు వదిలే ప్రసక్తే లేదు: జెలెన్ స్కీ

దాడులు భీకరంగా జరుగుతున్న నేపథ్యంలో ఆయుధాలు వదిలేస్తే చర్చలకు సిద్ధమన్న రష్యా ఆఫర్ ను ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీ తోసిపుచ్చారు. ఆయుధాలను వదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ప్రాణాలు పోయినా ఆయుధాలను కింద పడేయబోమన్నారు. ఫేక్ గాళ్లను నమ్మొద్దంటూ పేర్కొన్నారు. ఇవాళ ఉదయం ఆయన మరో వీడియోను విడుదల చేశారు. 

‘‘నేను ఇక్కడే ఉన్నాను. ఆయుధాలు పడేసేది లేదు. మనమే మన దేశాన్ని కాపాడుకుంటున్నాం. ఎందుకంటే మన ఆయుధం.. సత్యం. ఆ సత్యం.. మన దేశం, మన భూమి, మన పిల్లలు. వాటన్నింటినీ మనం కాపాడుకుంటున్నాం’’ అని పేర్కొన్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ ఫోన్ చేసి ఆయుధాలిస్తామన్నారని, యుద్ధ వ్యతిరేక కూటమి సాయం చేస్తోందని చెప్పారు. 

కాగా, కీవ్ సరిహద్దుల్లో పరిస్థితులు నియంత్రణలోనే ఉన్నాయని జెలెన్ స్కీ సలహాదారు మైహైలో పొదోలియాక్ చెప్పారు. ఉన్న ఆయుధాలన్నింటినీ కీవ్ లోకి తీసుకొచ్చేందుకు రష్యా ప్రయత్నించిందని, సైన్యం తీవ్రంగా ప్రతిఘటిస్తోందని చెప్పారు. తక్షణ ఆర్థిక సాయం కింద 35 కోట్ల డాలర్లను ఉక్రెయిన్ కు అందించాల్సిందిగా అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ను అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశించారు.

  • Loading...

More Telugu News