Ukraine: యుద్ధం వేళ ఉక్రెయిన్ పరిస్థితులకు అద్దం పడుతూ ప్రపంచంతో కన్నీరు పెట్టిస్తోన్న వీడియో!
- సురక్షిత ప్రాంతాలకు పిల్లలను పంపుతోన్న తల్లిదండ్రులు
- కూతురిని పంపుతూ కన్నీరు పెట్టుకున్న తండ్రి
- గుండెకు హత్తుకుని చివరకు సాగనంపిన వైనం
రష్యా తన సైన్యాన్ని ఉక్రెయిన్‌లోకి పంపించి దాడులు చేస్తుండడం కలకలం రేపుతోంది. దీంతో ఉక్రెయిన్ లో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇంటర్‌నెట్, డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు కూడా సరిగ్గా పని చేయకుండాపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో సూపర్ మార్కెట్లకు ప్రజలు పోటెత్తి సరుకులు కొనుక్కుంటున్నారు. ఏటీఎం కార్డులు పనిచేయకుండా పోవడంతో కొందరికి ఆ అవకాశం కూడా దక్కలేదు.
ఇంట్లో ఉన్న సరుకులు అయిపోతే తమ పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు. దీంతో కనీసం పిల్లలనయినా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని తల్లిదండ్రులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులకు దూరమవుతోన్న వారు పడుతోన్న వేదన వర్ణనాతీతం. ఉక్రెయిన్‌లో ఓ వ్యక్తి తన కూతురు, భార్యను సురక్షిత ప్రాంతానికి పంపిస్తూ భావోద్వేగానికి గురైన ఓ వీడియో బయటకు వచ్చింది.
చిన్నారిని మరో ప్రాంతానికి పంపుతోన్న సమయంలో ఆమెను ఆ తండ్రి గుండెకు హత్తుకొని కన్నీరు పెట్టుకున్నారు. హృదయాన్ని కలచి వేస్తోన్న ఈ వీడియో ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతోంది. కూతురిని బస్సు ఎక్కించిన తండ్రి ఆమెను చూడకుండా ఎలా ఉండగలనోనంటూ బాధపడిన తీరు నెటిజన్లను కదిలిస్తోంది.
యుద్ధ తీవ్రతకు ఈ దృశ్యాలు అద్దం పడుతున్నాయని నెటిజన్లు పేర్కొంటున్నారు. రష్యా యుద్ధాన్ని ఆపేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రపంచ నియంతల చర్యలు ఎంతో కాలం కొనసాగవని, ఇది చరిత్ర చెబుతోన్న నిజమని కొందరు కామెంట్లు చేశారు. కాగా, సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్న ప్రజలతో పలు రహదారులు నిండిపోతున్నాయి.