YS Vivekananda Reddy: వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు.. ప్రకంపనలు సృష్టిస్తున్న అప్పటి సీఐ శంకరయ్య వాంగ్మూలం
- 28 జులై 2020న సీబీఐ ఎదుట శంకరయ్య వాంగ్మూలం
- కేసు నమోదు చేయొద్దని అవినాష్‌రెడ్డి తనపై ఒత్తిడి తెచ్చారన్న అప్పటి పులివెందుల సీఐ
- తలుపులు వేసి ఆధారాలను ధ్వంసం చేశారని వెల్లడి
ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసుకు సంబంధించి సీబీఐ విచారణలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. తాజాగా, ఈ కేసులో అప్పటి పులివెందుల సీఐ జె.శంకరయ్య ఇచ్చిన వాంగ్మూలం తాజాగా వెలుగులోకి వచ్చి సంచలనం సృష్టిస్తోంది. వివేకా హత్యకేసుపై కేసు నమోదు చేయాల్సిన అవసరం లేదని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఆయన అనుచరుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి తనతో చెప్పారని శంకరయ్య అన్నారు.
మృతదేహాన్ని పోస్టుమార్టానికి కూడా పంపించొద్దని చెప్పారని పేర్కొన్నారు. వివేకా హత్య జరిగిన ప్రదేశంలోని ఆధారాల ధ్వంసం అవినాష్‌రెడ్డి, వైఎస్ భాస్కరరెడ్డి, వైఎస్ మనోహర్‌రెడ్డి మార్గదర్శకత్వం, పర్యవేక్షణలోనే జరిగిందన్నారు. వివేకానందరెడ్డి రక్తపు వాంతులు, గుండెపోటుతో మృతి చెందారంటూ అవినాష్‌రెడ్డి.. ఆయన పీఏ రాఘవరెడ్డి ఫోన్ నంబరు నుంచి తనకు కాల్ వచ్చిందన్నారు. ఘటనా స్థలంలో ఆధారాలను ధ్వంసం చేస్తున్న సమయంలో ఇంట్లోకి ఎవరూ ప్రవేశించకుండా భాస్కరరెడ్డి తలుపులు మూసివేశారని గుర్తు చేసుకున్నారు.
రక్తపు మరకలను శుభ్రం చేసి, గాయాలకు కట్లుకట్టే సిబ్బందినే లోపలికి అనుమతించారని వివరించారు. వివేకా మృతిపై కేసు నమోదు చేయొద్దని దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి తనపై ఒత్తిడి తీసుకొచ్చిన విషయాన్ని అప్పటి ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. ఆయన ఆదేశాల మేరకు కేసు నమోదు చేసినట్టు చెప్పారు. ఈ మేరకు 28 జులై 2020న సీబీఐ అధికారుల ఎదుట శంకరయ్య ఇచ్చిన ఈ సంచలన వాంగ్మూలం తాజాగా వెలుగులోకి వచ్చి ప్రకంపనలు రేపుతోంది.