CM KCR: తెలంగాణ నేతలకు పరిపాలన చేతకాదన్నారు... ఇప్పుడేమైంది?: సీఎం కేసీఆర్
- నారాయణఖేడ్ లో సీఎం కేసీఆర్ పర్యటన
- పలు ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన
- తెలంగాణలో చీకట్లు అలముకుంటాయని చెప్పారని వెల్లడి
- ఇప్పుడు వారి రాష్ట్రంలోనే అంధకారం ఉందని వ్యాఖ్యలు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నారాయణఖేడ్ పర్యటనలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇవాళ సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తెలంగాణ నాయకులకు పరిపాలన చేతకాదన్నారని, తెలంగాణ వస్తే పరిశ్రమలు మూతపడిపోతాయని చెప్పారని వెల్లడించారు. తెలంగాణలో చీకట్లు అలముకుంటాయని ప్రచారం చేశారని తెలిపారు. మమ్మల్ని విమర్శించిన వారి రాష్ట్రంలోనే ఇప్పుడు అంధకారం అలముకుంది అని పరోక్షంగా ఏపీపై విమర్శలు చేశారు.
ఏడేళ్లలో తెలంగాణ రూపురేఖలు పూర్తిగా మారాయని సీఎం కేసీఆర్ వివరించారు. తెలంగాణలో 24 గంటల విద్యుత్ అందిస్తున్నామని చెప్పారు. తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణది అగ్రస్థానం అని అన్నారు.
భారత్ ను అమెరికా కంటే గొప్పగా తయారుచేయాలని ఆకాంక్షించారు. ఇప్పటివరకు మన విద్యార్థులు అమెరికా వెళ్లేవారని, ఇకపై విదేశీ విద్యార్థులు భారత్ కు వచ్చేలా ఇక్కడ అభివృద్ధి జరగాలని కేసీఆర్ అభిలషించారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి దేశాన్ని బాగుచేసుకుందామని పిలుపునిచ్చారు.