epfio: రూ.15,000కు మించి వేతనం ఉంటే కొత్త పింఛను పథకం.. ఈపీఎఫ్ వో పరిశీలన
- మరింత జమలకు అవకాశం
- తద్వారా మరింత పెన్షన్ కు వీలు
- మార్చి 11, 12 సమావేశంలో చర్చ
- ప్రస్తుత పథకంలో పరిమితులు
ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ సంఘటిత రంగంలోని ఉద్యోగుల కోసం ఒక కొత్త పింఛను పథకాన్ని తీసుకురావాలన్న యోచనతో ఉంది. ప్రస్తుత చట్ట నిబంధనల ప్రకారం ఉద్యోగంలో చేరే సమయంలో బేసిక్ వేతనం రూ.15,000 వరకు ఉంటే ‘ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ 1995 ’లో చేరడం తప్పనిసరి. రూ.15,000కు మించి ఉంటే తప్పనిసరేమీ కాదు. స్వచ్చందమే.
రూ.15,000కు మించి బేసిక్ వేతనం ఉన్న వారు కూడా పెన్షన్ స్కీమ్ లో చేరితే, కంట్రిబ్యూషన్ అన్నది రూ.15,000కే పరిమితం అవుతుంది. ఉద్యోగి, సంస్థ 12 శాతం చొప్పున ఉద్యోగి ఈపీఎఫ్ ఖాతాకు జమ చేయడం తెలిసిందే. దీంతో రూ.15,000కు పైన వేతనం ఉన్నాకానీ, 15,000కు 12 శాతం చొప్పున రూ.1,800 గరిష్ట వాటాగా ఉంటోంది. దీంతో రూ.15,000కుపైన బేసిక్ వేతనం ఉన్న ఉద్యోగులు మరింత మొత్తాన్ని జమ చేసేందుకు వీలుగా కొత్త పథకాన్ని తీసుకురావాలని అనుకుంటోంది.
ఉద్యోగి జమ చేసే 12 శాతం నేరుగా భవిష్యనిధి ఖాతాకు చేరుతుంది. సంస్థ జమ చేసే 12 శాతంలో 8.33 శాతం ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ కు వెళ్లి, మిగిలిన మేర పీఎఫ్ కింద జమ అవుతుంది.
అధిక జమ, అధిక పెన్షన్ కు డిమాండ్ పెరుగుతుండడంతో ఈ అంశం పరిశీలనలో ఉన్నట్టు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు వెల్లడించాయి. మార్చి 11,12 తేదీల్లో గౌహతిలో జరిగే ఈపీఎఫ్ వో సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో ఈ అంశం చర్చకు రానుంది. పెన్షన్ అంశాలపై ఏర్పాటైన సబ్ కమిటీ సైతం తన నివేదికను సమర్పించనుంది.