TMC: టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా అభిషేక్ బెనర్జీ.. పార్టీ తదుపరి వారసుడిపై మమత సంకేతం!
- పార్టీ జాతీయ ఉపాధ్యక్షులుగా యశ్వంత్ సిన్హా, సుబ్రత బక్షి, చంద్రిమి భట్టాచార్య
- రాజ్యసభ, లోక్‌సభకు పార్టీ ప్రతినిధుల నియామకం
- సుస్మితా దేవ్‌కు ఈశాన్య రాష్ట్రాల బాధ్యతలు
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా మళ్లీ నియమితులయ్యారు. మమత నివాసంలో నిన్న పార్టీ జాతీయ వర్కింగ్ కమిటీ సమావేశమైంది. జాతీయ రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని ఈ సందర్భంగా పదవులు కేటాయించారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా అభిషేక్ మరోమారు నియమితులు కాగా, ఉపాధ్యక్షులుగా యశ్వంత్ సిన్హా, సుబ్రత బక్షి, చంద్రిమి భట్టాచార్యలను నియమించారు. అలాగే, యశ్వంత్ సిన్హా, అమిత్ మిత్రాలకు ఆర్థిక విధానాల నిర్వహణ బాధ్యత కూడా అప్పగించారు.
సుఖేందు శేఖర్‌ను రాజ్యసభలో పార్టీ ప్రతినిధిగా నియమించగా, ఘోష్ దస్తీదార్ లోక్‌సభలో పార్టీ ప్రతినిధిగా నియమితులయ్యారు. మహోవ మెయిట్రో, సుఖేంద్ శేఖర్, ఘోష్ దస్తిదార్‌లను జాతీయ ప్రతినిధులుగా నియమించారు. ఈశాన్య రాష్ట్రాల వ్యవహారాల బాధ్యతలను సుస్మితాదేవ్‌కు అప్పగించారు.
పార్టీలోని యువ నేతలు, సీనియర్ల మధ్య దూరం పెరుగుతున్న నేపథ్యంలో పార్టీ నేషనల్ ఆఫీస్ బేరర్ల కమిటీని మమతా బెనర్జీ ఇటీవల రద్దు చేశారు. 20 మంది సభ్యులతో కొత్తగా వర్కింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి కీలకమైన జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిని అప్పగించడం ద్వారా పార్టీ తదుపరి వారసుడు ఆయనేనని మమత చెప్పకనే చెప్పారు.