Chinna Jeeyar Swamy: సమతామూర్తి సందర్శనకు సీఎం కేసీఆర్ రాకపోవడంపై చిన్నజీయర్ స్వామి స్పందన

Chinna Jeeyar Swamy opines on CM KCR issue

  • ముచ్చింతల్ ఆశ్రమంలో వైభవంగా సహస్రాబ్ది వేడుకలు
  • సమతామూర్తి విగ్రహం ఆవిష్కరణ
  • విచ్చేసిన ప్రముఖులు
  • దూరంగా ఉన్న కేసీఆర్

ముచ్చింతల్ లోని చిన్నజీయర్ స్వామి ఆశ్రమంలో విశ్వసమతామూర్తి శ్రీరామానుజాచార్యుల వారి సహస్రాబ్ది వేడుకలు అత్యంత వైభవంగా జరగడం తెలిసిందే. ఇక్కడ 216 అడుగుల ఎత్తున సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించగా, సమతామూర్తి కేంద్రాన్ని రాష్ట్రపతి, ప్రధాని, పలువురు కేంద్రమంత్రులు, ఏపీ సీఎం జగన్, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు సందర్శించారు. అయితే, తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం సమతామూర్తి సందర్శనకు హాజరు కాలేదు.

దీనిపై చిన్నజీయర్ స్వామి స్పందించారు. ఈ కార్యక్రమానికి తాను ప్రథమ సేవకుడినని కేసీఆర్ అన్నారని గుర్తు చేశారు. అయితే కేసీఆర్ రాకపోవడానికి అనారోగ్యం లేదా పనుల ఒత్తిడి కారణం అయ్యుంటుందని భావిస్తున్నామని తెలిపారు. రేపు నిర్వహిస్తున్న శాంతి కల్యాణానికి కూడా సీఎం కేసీఆర్ ను ఆహ్వానించామని చిన్నజీయర్ స్వామి వెల్లడించారు. స్వపక్షం, ప్రతిపక్షం అనేవి రాజకీయాల్లోనే ఉంటాయని, తమకు అందరూ సమానమేనని ఆయన స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ సమతామూర్తిని సందర్శించాలనేది తమ ఆకాంక్ష అని తెలిపారు.

సహస్రాబ్ది వేడుకల రెండో రోజున మాత్రం సీఎం కేసీఆర్ ముచ్చింతల్ ఆశ్రమానికి వచ్చి అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. అంతకుమించి ఆయన ప్రత్యేకంగా సమతామూర్తిని దర్శించుకోలేదు. అయితే, కేసీఆర్ కు, చిన్నజీయర్ స్వామికి మధ్య విభేదాలు తలెత్తాయన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో చిన్నజీయర్ స్వామి పైవిధంగా స్పందించారు. కేసీఆర్ తో తనకెందుకు విభేదాలు ఉంటాయని ప్రశ్నించారు. కేసీఆర్ సహకారంతోనే ఈ వేడుకలు విజయవంతంగా నిర్వహించగలిగామని చెప్పారు.

Chinna Jeeyar Swamy
CM KCR
Samathamurthi
Muchintal
  • Loading...

More Telugu News