Sydney: స్విమ్మర్ పై దాడి చేసి చంపేసిన షార్క్ చేప.. సిడ్నీలో బీచ్ ల మూసివేత
- 1963 తర్వాత తొలిసారిగా ఈ తరహా దాడి
- షార్క్ ను గుర్తించేందుకు రంగంలోకి డ్రోన్లు
- పట్టుకునేందుకు డ్రమ్ లైన్ల ఏర్పాటు
ఆస్ట్రేలియాలోని సిడ్నీలో విషాదం చోటు చేసుకుంది. సిడ్నీకి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘లిటిల్ బే బీచ్’ సమీపంలో స్విమ్మర్ పై ఓ షార్క్ చేప (సొరచేప) దాడి చేసింది. ఈ దాడిలో స్విమ్మింగ్ చేస్తున్న వ్యక్తి మరణించాడు. బుధవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. మరణించిన వ్యక్తి ఎవరన్నది పోలీసులు ఇంకా గుర్తించలేదు.
ఈ ఘటనతో సిడ్నీలోని బాండి, బ్రోంటే సహా పలు బీచ్ లను మూసివేశారు. 1963 తర్వాత ఒక షార్క్ చేప దాడిలో వ్యక్తి మరణించడం ఇదే మొదటిసారి. షార్క్ చేపను పట్టుకునే ఏర్పాట్లు చేశారు. దాడి జరిగిన బీచ్ ప్రాంతంలో డ్రమ్ లైన్లను ఏర్పాటు చేశారు. షార్క్ చేప అక్కడే ఉందా? అన్నది గుర్తించేందుకు డ్రోన్లను రంగంలోకి దింపారు.
తెల్లటి రంగులో, 9.8 అడుగుల పొడవుతో ఉన్న షార్క్ దాడి చేసినట్టు న్యూ సౌత్ వేల్స్ డిపార్ట్ మెంట్ ఆఫ్ ప్రైమరీ ఇండస్ట్రీస్ అధికార ప్రతినిధి తెలిపారు. దాడి జరిగిన బీచ్ కు దూరంగా ఉండాలని అధికారులు ప్రజలకు సూచించారు.