Taslima Nasreen: మత విశ్వాసాలను పాటించాల్సింది విద్యా సంస్థల్లో కాదు..: తస్లీమా నస్రీన్
- హిజాబ్ అణచివేతకు చిహ్నం
- 7వ శతాబ్దంలో పెట్టిన దుష్ట ఆచారం ఇది
- పురుషుల కళ్లలో పడకుండా ఉండేందుకే
- మతం కంటే విద్యే గొప్పదన్న తస్లీమా
బంగ్లాదేశ్ కు చెందిన ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్ హిజాబ్ ఆచారాన్ని తప్పుబట్టారు. అణచివేతకు నిదర్శనంగా దీనిని ఆమె అభివర్ణించారు. కర్ణాటక రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యా సంస్థలు హిజాబ్ ధరించిన విద్యార్థినులను అనుమతించకపోవడంతో ఇది వివాదానికి దారి తీయడం తెలిసిందే. దీనిపై కర్ణాటక హైకోర్టులో విచారణ కూడా నడుస్తోంది.
దీంతో ముస్లిం సామాజిక వర్గానికే చెందిన తస్లీమా స్పందించారు. హిజాబ్, బుర్ఖా, నిఖాబ్ అన్నీ కూడా అణచివేతకు చిహ్నాలుగా ఆమె పేర్కొన్నారు. పాఠశాలల్లో మత ఆచారాలు, విశ్వాసాలతో సంబంధం లేకుండా ఏకరూప దుస్తులు ధరించాలన్నది కర్ణాటక రాష్ట్ర సర్కారు విధానంగా ఉంది. దీనిపై తస్లీమా మాట్లాడుతూ.. హిజాబ్ తప్పనిసరా? అని ప్రశ్నించారు.
‘‘కొందరు ముస్లింలు హిజాబ్ తప్పనిసరి అని భావిస్తుంటారు. కొందరు తప్పనిసరి కాదని అనుకుంటారు. కానీ, హిజాబ్ ను 7వ శతాబ్దంలో స్త్రీ ద్వేషి ఎవరో ప్రవేశపెట్టారు. ఆ సమయంలో స్త్రీలను శృంగార వస్తువుగా చూసేవారు. పురుషుడు స్త్రీని చూస్తే వారిలో కామోద్దీపనలు కలుగుతాయని భావించేవారు. దాంతో మహిళలు హిజాబ్, బుర్ఖా ధరించేలా పెట్టారు. వీటి ద్వారా పురుషుల కళ్లలో పడకుండా ఉంటారు’’ అని తస్లీమా వివరించారు.
కానీ 21వ శతాబ్దంలో మహిళలు ఇతరులతో సమానమని భావిస్తున్నప్పుడు హిజాబ్, నిఖాబ్, బుర్ఖాలతో పనేముందన్నారు. ‘‘పాఠశాలలు, కాలేజీలు లౌకిక తత్వంతో ఉంటాయి. కనుక డ్రెస్ కోడ్ కూడా అలాగే ఉండాలి. మతం కంటే విద్య ముఖ్యమైనది. ప్రజలకు మత విశ్వాసాలు ఉండొచ్చు. వాటిని ఇంటి వద్ద కానీ, మరో చోట కానీ ఆచరించుకోవాలే కానీ, లౌకికవాద విద్యా కేంద్రంలో కాదు’’ అని ఆమె పేర్కొన్నారు.