Team India: కొనసాగుతున్న భారత్ జోరు.. తొలి టీ20లో ఘన విజయం
- కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో మ్యాచ్
- ఆల్‌రౌండర్ ప్రతిభతో ఆకట్టుకున్న రోహిత్ సేన
- రవి బిష్ణోయికి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’
వెస్టిండీస్‌తో స్వదేశంలో జరుగుతున్న సిరీస్‌లో భారత జట్టు దూకుడు ప్రదర్శిస్తోంది. అహ్మదాబాద్‌లో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన రోహిత్ సేన.. కోల్‌కతాలోని ప్రతిష్ఠాత్మక ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన తొలి టీ20లోనూ జయకేతనం ఎగురవేసింది. అన్ని విభాగాల్లోనూ ప్రత్యర్థిపై పైచేయి సాధించిన భారత జట్టు 6 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుని మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 1-0తో ముందంజ వేసింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. నికోలస్ పూరన్ 43 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో విరుచుకుపడి 61 పరుగులు సాధించాడు. మేయర్స్ 31, కెప్టెన్ పొలార్డ్ 24 పరుగులు చేశారు. మిగతా వారిలో ఎవరూ రాణించలేకపోయారు. భారత బౌలర్లలో హర్షల్ పటేల్, రవి బిష్ణోయి చెరో రెండు వికెట్లు తీసుకోగా, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, చాహల్ చెరో వికెట్ తీసుకున్నారు.
అనంతరం 158 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు మరో 7 బంతులు మిగిలి ఉండగానే 4 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ 40, ఇషాన్ కిషన్ 35, సూర్యకుమార్ యాదవ్ 34, వెంకటేశ్ అయ్యర్ 24 పరుగులు చేయగా, మాజీ సారథి విరాట్ కోహ్లీ 17 పరుగులు మాత్రమే చేశాడు. విండీస్ బౌలర్లలో రోస్టన్ చేజ్ 2 వికెట్లు తీసుకోగా, షెల్డన్ కాట్రెల్, ఫాబియన్ అలెన్ చెరో వికెట్ తీసుకున్నారు. రెండు కీలక వికెట్లు పడగొట్టిన రవి బిష్ణోయికి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.