Russia: ప్రత్యక్ష యుద్ధం తప్పిందనుకుంటే.. పరోక్ష యుద్ధం మొదలు.. ఉక్రెయిన్ రక్షణ శాఖ, బ్యాంకుల వెబ్ సైట్లు హ్యాక్!
- సైబర్ దాడికి పాల్పడిన దుండగులు
- డీడీవోఎస్ ఎటాక్ చేశారన్న అధికారులు
- హ్యాకింగ్ కు పాల్పడిన ఐపీ అడ్రస్ లను కట్ చేశామని వెల్లడి
ప్రత్యక్ష యుద్ధం తప్పిందనుకునేలోపే ఉక్రెయిన్ పై పరోక్ష దాడి జరిగింది. ఉక్రెయిన్ సరిహద్దుల నుంచి నిన్న రష్యా దళాల ఉపసంహరణ మొదలైన సంగతి తెలిసిందే. దీంతో యుద్ధం ముప్పు తప్పిందని అంతా సంతోషించారు. అయితే, ఇవాళ ఆ దేశంపై కొందరు దుండగులు సైబర్ దాడికి పాల్పడ్డారు. రక్షణ శాఖ, సైన్యం, వివిధ బ్యాంకుల వెబ్ సైట్లను హ్యాక్ చేసినట్టు ఉక్రెయిన్ ప్రభుత్వం ప్రకటించింది.
ఆ హ్యాకింగ్ ఎవరు చేశారన్న దానిపై ప్రస్తుతం ఎలాంటి వివరాలు తెలియరాలేదని ఆ దేశ సర్వీస్ ఆఫ్ స్పెషల్ కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్రొటెక్షన్ డిప్యూటీ చైర్మన్ విక్టర్ ఝోరా చెప్పారు. ప్రస్తుతం ఈ ఘటనపై ఆయనే దర్యాప్తు చేస్తున్నారు. డిస్ట్రిబ్యూటెడ్ డినయల్ ఆఫ్ సర్వీస్ (డీడీవోఎస్) ఎటాక్ అని ఆయన చెప్పారు. అంటే ఎవరైనా సైట్ ఓపెన్ చేసినా అది ఓపెన్ కాదని పేర్కొన్నారు. డీడీవోఎస్ దాడులు చాలా చీప్ అని, దాడి చేయడానికీ ఈజీగా ఉంటుందని చెబుతున్నారు.
ఉక్రెయిన్ కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు ప్రైవేట్ బ్యాంక్, ఒష్చాడ్ బ్యాంక్ ల సైట్లను హ్యాక్ చేసినట్టు అధికారులు చెబుతున్నారు. మంగళవారం రాత్రి రక్షణ శాఖకు చెందిన పలు వెబ్ సైట్లు కూడా హ్యాక్ అయినట్టు తెలిపారు. హ్యాకర్లు సైబర్ దాడికి పాల్పడిన ఐపీ అడ్రస్ లను కట్ చేశారని విక్టర్ ఝోరా తెలిపారు.