Alcohol: మద్యపానంతో పిల్లలు పుట్టడం కష్టమే.. వీర్యకణాలపై ప్రభావం పడుతోందంటున్న చెన్నై పరిశోధకులు
- లెడిగ్ అనే కణాలపై తీవ్రమైన ప్రభావం
- వీర్యాన్ని విడుదల చేసే లూటినైజింగ్ హార్మోన్ పైనా ఎఫెక్ట్
- భారీగా పడిపోతున్న వీర్య కణాలు
మద్యం తాగితే కాలేయం, గుండె జబ్బుల సమస్యలు వస్తాయని ఇప్పటిదాకా చెబుతున్నారు. అంతేకాదు.. ఎన్నో రకాల సమస్యలూ వేధిస్తాయని పలు పరిశోధనలు చెబుతున్నాయి. తాజాగా దాని ప్రభావం సంతానంపైనా పడుతుందని తేలింది. చెన్నైలోని చెట్టినాడ్ అకాడమీ ఆఫ్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్, చెట్టినాడ్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి చేసిన ఓ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది.
అధ్యయనంలో భాగంగా 231 మంది పురుషులపై పరిశోధన చేశారు. 81 మంది మద్యం తాగేవారు కాగా.. మరో 150 మంది మద్యం అలవాటు లేని వాళ్ల ఆరోగ్య వివరాలను సేకరించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల మేరకు వారి వీర్యం, వీర్యకణాలపై పరీక్షలు చేశారు. మద్యం అలవాటు లేనివాళ్లతో పోలిస్తే మద్యం తాగే వారిలో వీర్య కణాలుగానీ.. వాటి నాణ్యతగానీ చాలా చాలా తక్కువగా ఉన్నట్టు వెల్లడైంది.
టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ ను విడుదల చేసే వృషణాల్లోని లెడిగ్ కణాలపై మద్యం ప్రభావం చూపడం వల్లే ఈ సమస్య తలెత్తుతోందని తేల్చారు. వీర్యం విడుదలకు కారణమయ్యే లూటినైజింగ్ హార్మోన్, ఫొలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్లపైనా ప్రభావం చూపుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. దీంతో ఇది సంతానోత్పత్తిపై ప్రభాం పడుతోందని తేల్చారు.
సర్వేలో పాల్గొన్న వారిలో 21 నుంచి 52 ఏళ్ల వయసువాళ్లున్నారు. అయితే, 31 నుంచి 40 ఏళ్ల మధ్య ఉన్న వారు పరిమితికి మించి మద్యం తాగుతున్నట్టు చెప్పారు. 36 మంది రోజూ తాగేవారున్నారు. అలాంటి వారిలో వీర్యకణాల సంఖ్య చాలా తక్కువగా ఉందని, దాని వల్ల పిల్లలు కలగడం లేదని పరిశోధకులు చెబుతున్నారు.