Pawan Kalyan: విజయవాడలో ఉద్యోగుల ర్యాలీ విజయవంతం అయినందుకే సవాంగ్ ను తప్పించారా?: పవన్ కల్యాణ్
- సవాంగ్ ను బదిలీ చేసిన ఏపీ సర్కారు
- డీజీపీగా కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి
- ఇప్పటికిప్పుడు మార్చాల్సిన అవసరం ఏంటన్న పవన్
- ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్
ఏపీ డీజీపీగా గౌతమ్ సవాంగ్ ను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అన్ని వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. "సవాంగ్ అన్నా" అంటూ సీఎం జగన్ ఆయనపై ఎంతో అభిమానం చూపిస్తుంటారు. అలాంటిది... ఇప్పటికిప్పుడు ఆయనను జీఏడీకి బదిలీ చేయడం వెనుక కారణాలేంటో తెలియకపోవడంతో తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ స్పందించారు.
ఏపీ డీజీపీగా ఈ మధ్యాహ్నం వరకు విధుల్లో ఉన్న గౌతమ్ సవాంగ్ ను ఆకస్మికంగా బాధ్యతల నుంచి తప్పించడం విస్మయం కలిగించిందని పేర్కొన్నారు. "అధికారులను నియమించుకోవడం అనేది ప్రభుత్వానికి ఉన్న పాలనాపరమైన అధికారం కావొచ్చు... కానీ డీజీపీని హఠాత్తుగా మార్చాల్సిన అవసరం వైసీపీ ప్రభుత్వానికి ఏమొచ్చింది?" అంటూ పవన్ ప్రశ్నించారు.
డీజీపీ బదిలీపై గల కారణాలను ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో... విజయవాడలో పీఆర్సీకి వ్యతిరేకంగా ఉద్యోగులు చేపట్టిన ర్యాలీ విజయవంతం అయినందుకే సవాంగ్ పై బదిలీ వేటు వేశారని భావించాల్సి వస్తుందని స్పష్టం చేశారు.
సవాంగ్ బదిలీని ఉదాహరణగా చూపిస్తూ ఉన్నతాధికారుల నుంచి చిన్నపాటి ఉద్యోగి వరకు అందరినీ హెచ్చరించి, భయపెట్టి అదుపు చేసేందుకే ప్రభుత్వం ఈ చర్యకు దిగిందని ఆరోపించారు. ఇవాళ సవాంగ్ బదిలీ అయిన తీరు చూస్తుంటే గతంలో సీఎస్ గా ఉన్న ఎల్వీ సుబ్రహ్మణ్యంను ఆకస్మికంగా పక్కకు తప్పించడం గుర్తుకు వస్తోందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.