Khaidi Biryani: కాకినాడలో ఖైదీ బిర్యానీ... జైలు కాదు రెస్టారెంటే!
- కొత్త కాన్సెప్ట్ తో రెస్టారెంట్
- జైలు ఖైదీల యూనిఫాంలో సర్వర్లు
- జైలు గదుల తరహాలో ఊచలతో ప్రత్యేక క్యాబిన్లు
- గిరాకీ బాగానే ఉందంటున్న యాజమాన్యం
ఇప్పుడంతా కొత్తదనం కోరుకుంటున్నారు. వినూత్న తరహాలో ఆలోచించే యువత వివిధ రంగాల్లో దూసుకుపోతోంది. తాజాగా తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ఏర్పాటు చేసిన ఓ రెస్టారెంట్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ రెస్టారెంట్ పేరు ఖైదీ బిర్యానీ. ఈ రెస్టారెంట్ లోపలికి వెళ్లిన వారికి అచ్చం జైలు గదులను తలపించేలా క్యాబిన్లు దర్శనమిస్తాయి. ఆ క్యాబిన్లకు ఊచలు ఏర్పాటు చేయడంతో జైలు లుక్ వచ్చింది. ఇక సర్వర్లు కూడా ఖైదీల్లా యూనిఫాం వేసుకుని సేవలు అందిస్తుంటారు.
తమ వంటకాల రుచులతోనే కాకుండా, సరికొత్త కాన్సెప్ట్ తోనూ కస్టమర్లను ఆకట్టుకోవాలని భావిస్తున్నామని ఖైదీ బిర్యానీ రెస్టారెంట్ యాజమాన్యం చెబుతోంది. కాకినాడలోని ఈ జైలు కాన్సెప్టు రెస్టారెంట్ కు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారట. ఇందులో 16 సాధారణ క్యాబిన్లు, ఒక వీఐపీ క్యాబిన్ ఏర్పాటు చేశారు.