Payyavula Keshav: ప్రధానికి సీఎం జగన్ ఇచ్చిన వినతిపత్రంలో ప్రత్యేక హోదా ఊసే లేదు: పయ్యావుల కేశవ్
- క్రమంగా రగులుకుంటున్న హోదా అంశం
- సీఎం జగన్ ను నిలదీసిన పయ్యావుల
- ప్రజలకు జవాబు చెప్పాలంటూ డిమాండ్
ప్రత్యేక హోదా అంశంలో సీఎం జగన్ పై టీడీపీ నేత, పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ ధ్వజమెత్తారు. జనవరి 3న ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం జగన్ వినతిపత్రం ఇచ్చారని, అందులో ఏపీకి ప్రత్యేక హోదా అంశమే లేదని ఆరోపించారు. కనీసం దాని ప్రస్తావన కూడా లేదని అన్నారు.
"మీరు అడగకుండానే ప్రధానమంత్రి గారు హోదా ఇస్తామన్నారా? మీరు అడగకుండానే కేంద్రం అజెండాలో చేర్చిందా? మా ముఖ్యమంత్రి గారి పోరాట ఫలితమే అంటూ వైసీపీ నేతలు చెప్పుకున్నారు. పోరాట ఫలితమే అయితే ఏదీ?.. 14 పేజీల లేఖ రాస్తే అన్నీ మీ అవసరాల గురించే మాట్లాడుకున్నారు తప్ప, ఈ రాష్ట్ర ప్రయోజనాల గురించి, ఈ రాష్ట్రానికి కావాల్సిన ప్రత్యేక హోదా గురించి మచ్చుకైనా ప్రస్తావించలేదు. దీన్ని మీరు ఎలా సమర్థించుకుంటారు?
జగన్ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారా? లేక, జగన్ ను ప్రధానమంత్రి మోసం చేస్తున్నాడా? అనేది రాష్ట్ర ప్రజలకు తెలియాలి. మీ పలుకే బంగారం అన్నట్టుగా తయారయ్యారు. ఇప్పుడు మీ పలుకు కోసం రాష్ట్ర ప్రజానీకం ఎదురుచూస్తోంది. ప్రతిరోజు మీరు జరిపే సమీక్షల్లో సైలెంట్ వీడియోలు విడుదలవుతుంటాయి. సినిమా వాళ్లతో మాట్లాడినప్పుడే ఆడియోతో రిలీజైంది. ఇప్పుడదే తీరులో, మీరు ప్రధానితో హోదాపై మాట్లాడిన విషయాన్ని, ఆయన ఏమన్నారన్న విషయాన్ని ఆడియో ఉన్న వీడియో విడుదల చేయాలని కోరుతున్నాం" అంటూ పయ్యావుల తీవ్రస్థాయిలో స్పందించారు.