Tadekam Foundation: తదేకం ఫౌండేషన్ సేవలను ప్రశంసించిన పవన్ కల్యాణ్
- పలు ప్రాంతాల్లో తదేకం ఫౌండేషన్ సేవలు
- హైదరాబాదులో పవన్ ను కలిసిన ఫౌండేషన్ ప్రతినిధులు
- జనసైనికుల మద్దతు కొనసాగాలన్న పవన్
ఏపీలోని పలు ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న తదేకం ఫౌండేషన్ ప్రతినిధులు మాధవి, సాయి సుధ, నీలేశ్ హైదరాబాదులో జనసేనాని పవన్ కల్యాణ్ ను కలిశారు. తదేకం ఫౌండేషన్ కార్యాచరణ వివరాలు తెలుసుకున్న పవన్ వారిని అభినందించారు. మహావతార్ బాబాజీ స్ఫూర్తితో నౌషీర్ గురూజీ ప్రారంభించిన తదేకం ఫౌండేషన్ సేవలను మరింత ముందుకు తీసుకెళుతున్నారంటూ ప్రశంసించారు.
తదేకం ఫౌండేషన్ కార్యక్రమాలకు అనేకమంది ప్రముఖులు, యువత, తనకెంతో ఇష్టమైన జనసైనికులు కూడా మద్దతుగా నిలుస్తుండడం సంతోషదాయకమని పవన్ కల్యాణ్ అన్నారు. జనసైనికులు ఇకపైనా ఇదే స్ఫూర్తి కనబర్చాలని పిలుపునిచ్చారు.
"మహావతార్ బాబాని 'చిరంజీవి' అని చెబుతారు. నేను టెన్త్ క్లాస్ చదువుతున్నప్పుడు మా నాన్న నాకు 'ఒక యోగి ఆత్మకథ' పుస్తకం ఇచ్చారు. దాంతోపాటే క్రియో యోగ దీక్ష గురించి కూడా చెప్పారు. మహావతార్ బాబా భక్తులు నన్ను కలుస్తుంటారు. ఇప్పుడు 'తదేకం ఫౌండేషన్' ప్రతినిధులు నన్ను కలవడం సంతోషంగా ఉంది" అని పవన్ కల్యాణ్ వెల్లడించారు.