Galla Jayadev: అండర్-19 క్రికెటర్ షేక్ రషీద్ కు శుభాకాంక్షలు తెలిపిన గల్లా జయదేవ్
- జూనియర్ క్రికెట్లో సత్తా చాటుతున్న గుంటూరు కుర్రాడు
- అండర్-19 వరల్డ్ కప్ లో విశేష ప్రతిభ
- ఫైనల్లో అర్ధసెంచరీ నమోదు
- షేక్ రషీద్ పై అభినందనల వెల్లువ
ఇటీవల భారత జూనియర్ క్రికెట్లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు షేక్ రషీద్. ఈ కుర్రాడిది గుంటూరు. ఇటీవల ముగిసిన అండర్-19 వరల్డ్ కప్ లో రషీద్ బ్యాట్ నుంచి పరుగులు వెల్లువెత్తాయి. ఫైనల్లో అర్ధసెంచరీ సాధించి భారత జట్టు టైటిల్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. 17 ఏళ్ల రషీద్ పై ప్రస్తుతం అభినందనల జడివాన కురుస్తోంది. భవిష్యత్తులో టీమిండియాకు అన్ని ఫార్మాట్లలో వన్ డౌన్ లో ఆడగలిగే సత్తా ఉన్న ఆటగాడు అని టీమిండియా మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ అంతటివాడు కితాబిచ్చాడు.
తాజాగా, టీడీపీ నేత, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ సైతం రషీద్ ప్రతిభాపాటవాలకు ముగ్ధుడయ్యారు. ఆంధ్రా గర్వించేలా మరో క్రికెటర్ సత్తా చాటాడని కొనియాడారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం పాత మల్లాయపాలెంకు చెందిన షేక్ రషీద్ భారత జట్టు అండర్-19 వరల్డ్ కప్ గెలవడానికి కృషి చేసి అందరి దృష్టిని ఆకర్షించాడని కొనియాడారు. ఈ సందర్భంగా రషీద్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నానని, భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించాలని ఆశిస్తున్నానని గల్లా జయదేవ్ తెలిపారు.
రషీద్ కుటుంబం ప్రస్తుతం గుంటూరులో నివాసం ఉంటోంది. గుంటూరులోని ఓ ప్రైవేటు కాలేజీలో రషీద్ ఇంటర్ చదువుతున్నాడు. ఇటీవల కాలంలో జూనియర్ క్రికెట్ లో ప్రకంపనలు రేపుతున్న షేక్ రషీద్... వరల్డ్ కప్ కోసం టీమిండియా అండర్-19 జట్టుకు ఎంపికయ్యాడు. వరల్డ్ కప్ ఆడేందుకు వెస్టిండీస్ కు వెళ్లిన తర్వాత టోర్నీ మధ్యలో కరోనా బారినపడినా, అధైర్య పడకుండా, మళ్లీ బరిలో దిగి ఫామ్ చాటుకున్నాడు.
వరల్డ్ కప్ లో రషీద్ 4 మ్యాచ్ లు ఆడి 50.25 సగటుతో మొత్తం 201 పరుగులు నమోదు చేశాడు. వాటిలో రెండు అర్ధసెంచరీలు ఉన్నాయి. ముఖ్యంగా ఫైనల్లో జట్టుకు అత్యవసరమైన స్థితిలో పరుగులు అందించి తన ప్రత్యేకత ఏంటో నిరూపించుకున్నాడు.