PRC: ఉపాధ్యాయ సంఘాలు తగ్గితే మంచిది.. వారి వల్లే ఉద్యమం విజయవంతం కాలేదు: సూర్యనారాయణ
- ఉద్యమంలో ఉపాధ్యాయుల పాత్ర మాత్రమే ఉన్నట్టు ప్రచారం
- తామే చాంపియన్లమని చెప్పుకోవడం వారికి తగదు
- వారు బయటకు రావడం వెనక రాజకీయ ప్రయోజనాలు
‘చలో విజయవాడ’ విజయవంతమైంది కేవలం ఉపాధ్యాయుల వల్ల మాత్రమే కాదని, కాబట్టి వారు కొంత తగ్గితే మంచిదని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ అన్నారు. ఉద్యమంలో ఉపాధ్యాయుల పాత్ర మాత్రమే ఉన్నట్టు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. హీరోయిజం కోసం ఉపాధ్యాయ సంఘాలు ప్రవర్తిస్తే తామేమీ చేయలేమని అన్నారు. తాము మాత్రమే ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడుతున్నామని చెప్పుకోవడం తగదన్నారు. తామే చాంపియన్లమని చెప్పుకోవడం సరికాదని హితవు పలికారు.
ఉపాధ్యాయ సంఘాలు బయటకు రావడంలో ఏ రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయో తమకు తెలుసని అన్నారు. ఈ నిరసన అంతా టీ కప్పులో తుపాను లాంటిదని, త్వరలోనే అది సమసిపోతుందని అన్నారు. ఫిట్‌మెంట్ మినహా మిగతా అంశాల్లో ఎంతోకొంత పునరుద్ధరించారని, మరో మూడు అంశాల్లో ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నట్టు సూర్యనారాయణ చెప్పారు.