Mohammad Shahzad: క్రికెట్ మైదానంలో దమ్ము కొట్టిన ఆఫ్ఘనిస్థాన్ ఆటగాడు

Afghanistan cricketer caught smoking in the field

  • బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ లో ఘటన
  • మ్యాచ్ కు ముందు మైదానంలోకి వచ్చిన షెహజాద్
  • నోటి నుంచి గుప్పుమంటూ పొగలు
  • కెమెరాలకు చిక్కిన వైనం
  • జరిమానా విధించిన మ్యాచ్ రిఫరీ

బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్)లో ఓ దృశ్యం అందరినీ నివ్వెరపరిచింది. క్రికెట్ మైదానంలో, అది కూడా మ్యాచ్ సమయంలో ఓ ఆటగాడు పబ్లిగ్గా సిగరెట్ తాగడం అందరినీ ఆగ్రహానికి గురిచేసింది. ఆ ఆటగాడి పేరు మహ్మద్ షెహజాద్. షెహజాద్ ఆఫ్ఘనిస్థాన్ స్టార్ ఆటగాడు. వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ గా ఆఫ్ఘన్ విజయ ప్రస్థానంలో ముఖ్యమైన ఆటగాళ్లలో ఒకడు. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ లో మినిస్టర్ గ్రూప్ ఢాకా జట్టు తరఫున ఆడుతున్నాడు.

కొమిల్లా విక్టోరియన్స్, మినిస్టర్ గ్రూప్ ఢాకా జట్ల మధ్య మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. అయితే షెహజాద్, ఇతర ఆటగాళ్లతో కలిసి మైదానంలో ఉన్న సమయంలో అతడు పొగతాగుతున్న విషయం కెమెరాలకు దొరికిపోయింది. అతడి నోటి నుంచి సిగరెట్ పొగలు గుప్పుమంటూ వెలువడినప్పటి ఫొటోలు సోషల్ మీడియాలో దుమారం రేపాయి. కాగా, షెహజాద్ స్మోకింగ్ చేస్తున్న విషయం గమనించిన అతడి జట్టు కోచ్, మరో సీనియర్ ఆటగాడు వచ్చి వెంటనే అతడిని డ్రెస్సింగ్ రూమ్ కు తీసుకెళ్లారు.

కాగా, నెటిజన్లు దీనిపై మండిపడుతున్నారు. షెహజాద్ ను బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ లో ఆడకుండా జీవితకాల నిషేధం విధించాలని కోరుతున్నారు.

షెహజాద్ సిగరెట్ తాగిన విషయం మ్యాచ్ రిఫరీ దృష్టికి వెళ్లింది. దీన్ని తీవ్రంగా పరిగణించిన రిఫరీ మందలించడంతో పాటు ఒక డీమెరిట్ పాయింట్ ఇచ్చారు. ఈ వ్యవహారంపై స్పందించిన ఆఫ్ఘన్ క్రికెటర్ షెహజాద్ తాను చేసింది తప్పేనని అంగీకరించాడు. క్రికెట్ అభిమానుల ఆగ్రహాన్ని తాను అర్థం చేసుకున్నానని, తనను క్షమించాలని పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News