Karnataka: విద్యార్థులంతా యూనిఫాంలో రావాల్సిందే.. తేల్చి చెప్పిన కర్ణాటక ప్రభుత్వం

Students Must Follow Uniform Code Says Karnataka Govt

  • అన్ని విద్యా సంస్థలూ పాటించాలని ఆదేశం
  • మరింత ముదురుతున్న హిజాబ్ వివాదం
  • సరస్వతి దేవి తేడా చూపించదన్న రాహుల్
  • విద్యకు మతం రంగు పులుముతున్నారన్న బీజేపీ

కర్ణాటకలో హిజాబ్ వివాదం మరింత ముదురుతోంది. విద్యార్థులందరూ తప్పనిసరిగా యూనిఫాంనే ధరించాల్సి ఉంటుందని, ఇది అన్ని విద్యాసంస్థలకూ వర్తిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. హైకోర్టు తీర్పు వచ్చే వరకు ప్రభుత్వ ఆదేశాలను పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. హిజాబ్ ధరించారన్న కారణంతో ఉడుపి జిల్లాలోని బిందూర్ లో ఉన్న పీయూ గవర్నమెంట్ కాలేజీ విద్యార్థినులను క్లాసులోకి అనుమతించలేదు.

అంతకుముందు కుందాపూర్ లోని మూడు కాలేజీలు, ఉడుపిలోని మరో కాలేజీలోనూ ఇదే కారణంతో విద్యార్థినులను క్లాసులోకి రానివ్వలేదు. ఇటు రామదుర్గలోని పీయూ కాలేజీలో విద్యార్థులు కాషాయ కండువాలతో రావడమూ వివాదాస్పదమైంది. వారికీ అనుమతిని నిరాకరించారు. ఇకపై ఎవరూ హిజాబ్ గానీ, కాషాయ కండువాలతోగానీ కాలేజీకి రాకూడదని కాలేజీ యాజమాన్యాలు ఆదేశాలిచ్చాయి.

ఈ క్రమంలోనే విద్యార్థులు ఆందోళనకు దిగారు. దీంతో అడ్వొకేట్ జనరల్ తో సీఎం బసవరాజ్ బొమ్మై, విద్యాశాఖ మంత్రి బి.వి. నగేశ్ సమావేశమయ్యారు. తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అనంతరం అన్ని స్కూళ్లు, కాలేజీల్లో యూనిఫాంనే విద్యార్థులంతా ధరించాలని మంత్రి నగేశ్ తేల్చి చెప్పారు. కర్ణాటక ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం యూనిఫాంను ఆయా స్కూళ్లు, కాలేజీలే నిర్ణయించుకోవచ్చని స్పష్టం చేశారు. విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే యూనిఫాం కోడ్ ను విద్యార్థులకు స్పష్టంగా చెప్పాలని పేర్కొన్నారు. మరో ఐదేళ్ల దాకా ఆ యూనిఫాం కోడ్ ను మార్చరాదని సూచించారు.

కర్ణాటకలో హిజాబ్ వ్యవహారంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు. హిజాబ్ వేసుకున్న విద్యార్థినులను అనుమతించకపోవడమంటే భారత బిడ్డల భవిష్యత్ ను లాగేసుకోవడమేనని అన్నారు. సరస్వతి దేవి అందరికీ జ్ఞానాన్ని ప్రసాదిస్తుందని, ఎలాంటి తేడాలూ చూపించదని అన్నారు. సరస్వతిపూజ అంటూ హాష్ ట్యాగ్ పెట్టారు.

బీజేపీ కర్ణాటక నేతలు కౌంటర్ ఇచ్చారు. విద్యకు మతం రంగు పులుముతున్నారంటూ రాహుల్ పై మండిపడ్డారు. భారత భవిష్యత్ కు తాను ప్రమాదకరమని మరోసారి ఆయన నిరూపించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చదువుకోవడానికి హిజాబ్ అంత అవసరమే అయితే.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు తప్పనిసరి చేయడం లేదని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News