CM KCR: ముచ్చింతల్ ఆశ్రమంలో రామానుజాచార్యులు విగ్రహాన్ని పరిశీలించిన సీఎం కేసీఆర్
- శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది వేడుకలు
- కుటుంబ సభ్యులతో కలిసి విచ్చేసిన సీఎం కేసీఆర్
- ముచ్చింతల్ ఆశ్రమంలో ఘనస్వాగతం
- సీఎం కేసీఆర్ వెంట వైసీపీ ఎమ్మెల్యేలు
శ్రీ రామానుజాచార్యుల వారి సహస్రాబ్ది ఉత్సవాల్లో నేడు సీఎం కేసీఆర్ కూడా పాల్గొన్నారు. ఆయన ఈ సాయంత్రం ముచ్చింతల్ లోని చిన్నజీయర్ స్వామి ఆశ్రమానికి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లారు. కాగా, ఆశ్రమ సందర్శనకు వచ్చిన కేసీఆర్ కు వేదపండితులు ఘనస్వాగతం పలికారు. రెండ్రోజులుగా నిర్వహిస్తున్న సహస్రాబ్ది సమారోహం వేడుకకు కేసీఆర్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆశ్రమంలోని శ్రీరామనగరం అంతా కలియదిరిగారు. 216 అడుగుల ఎత్తున ఏర్పాటు చేసిన సమతామూర్తి శ్రీ రామానుజాచార్యుల విగ్రహాన్ని ఆసక్తిగా పరిశీలించారు. విగ్రహ వివరాలను చిన్నజీయర్ స్వామి సీఎం కేసీఆర్ కు వివరించారు.
సీఎం కేసీఆర్ వెంట మైహోమ్ రామలింగేశ్వరరావు, ఏపీ వైసీపీ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రోజా కూడా ఉన్నారు. రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు ఫిబ్రవరి 2న మొదలయ్యాయి. ఈ నెల 14వరకు కొనసాగనున్నాయి.