Kajal Aggarwal: కాజల్ అగర్వాల్ కు గోల్డెన్ వీసా అందించిన యూఏఈ
- ప్రముఖుల కోసం ప్రత్యేకంగా వీసాలు
- స్పాన్సర్ అవసరం లేకుండానే యూఏఈలో ఉండే అవకాశం
- గోల్డెన్ వీసా దక్కడంపై కాజల్ హర్షం
కేవలం కొద్దిమంది ప్రముఖులకు మాత్రమే ఇచ్చే గోల్డెన్ వీసాను యూఏఈ పాలకులు తాజాగా అందాలనటి కాజల్ అగర్వాల్ కు కూడా అందజేశారు. దీనిపై కాజల్ స్పందిస్తూ, యూఏఈ ప్రభుత్వం నుంచి గోల్డెన్ వీసా అందుకోవడం సంతోషంగా ఉందని తెలిపింది.
తమవంటి కళాకారులకు యూఏఈ మొదటి నుంచి ఎనలేని ప్రోత్సాహం అందిస్తోందని కొనియాడింది. ఇది తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని, భవిష్యత్తులో యూఏఈలో చేపట్టబోయే కార్యకలాపాల పట్ల ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని కాజల్ తెలిపింది. ఈ సందర్భంగా మహ్మద్ షానిద్, సురేశ్ పున్నస్సెరిల్, నరేశ్ కృష్ణలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు వెల్లడించింది.
యూఏఈ అందించే ఈ గోల్డెన్ వీసా ఉంటే విదేశీయులు ఎలాంటి స్పాన్సర్ షిప్ అవసరం లేకుండా యూఏఈలో ఉద్యోగాలు చేసుకోవడానికి, నివసించడానికి వీలు కలుగుతుంది. అంతేకాదు, గోల్డెన్ వీసా ఉన్నవారిని యూఏఈ పౌరులుగా గుర్తిస్తారు. వారు యూఏఈలో సొంతంగా వ్యాపారాలు కూడా చేసుకోవచ్చు. 5, 10 సంవత్సరాల కాలపరిమితి ఉన్నప్పటికీ ఈ వీసా ఆటోమేటిగ్గా రెన్యువల్ అవుతుంటుంది. ఇటీవల మెగా కోడలు ఉపాసన కూడా ఈ గోల్డెన్ వీసా అందుకుంది.