Nagavamsi: సీఎం జగన్ ఎప్పుడు నైట్ కర్ఫ్యూ ఎత్తేస్తే అప్పుడు 'భీమ్లా నాయక్' విడుదల చేస్తాం: నిర్మాత నాగవంశీ
- పవన్ హీరోగా భీమ్లా నాయక్
- ఫిబ్రవరి 25న గానీ, ఏప్రిల్ 1న గానీ రిలీజ్
- పరిస్థితులు చక్కబడ్డాకే రిలీజ్ చేస్తామన్న చిత్రబృందం
- నైట్ కర్ఫ్యూ ఎత్తివేతపై జగన్ గారినే అడగాలన్న నాగవంశీ
పవన్ కల్యాణ్ హీరోగా నటించిన 'భీమ్లా నాయక్' కు చిత్రబృందం రెండు విడుదల తేదీలు ప్రకటించడం తెలిసిందే. కరోనా వ్యాప్తి, ప్రభుత్వాల ఆంక్షల నేపథ్యంలో పరిస్థితులు ఎప్పుడు బాగుంటే అప్పుడు తమ చిత్రాన్ని విడుదల చేస్తామని చిత్ర నిర్మాణ సంస్థ వెల్లడించింది. ఫిబ్రవరి 25న గానీ, లేకపోతే ఏప్రిల్ 1న గానీ ప్రేక్షకుల ముందుకు వస్తామని తెలిపింది.
దీనిపై భీమ్లా నాయక్ నిర్మాత, సితార ఎంటర్టయిన్ మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ ఆసక్తికరంగా స్పందించారు. ఏపీలో సీఎం జగన్ ఎప్పుడు నైట్ కర్ఫ్యూ ఎత్తేస్తే అప్పుడు 'భీమ్లా నాయక్' రిలీజ్ చేస్తామని చెప్పారు. నైట్ కర్ఫ్యూ ఎత్తేసే విషయం జగన్ గారినే అడగాలని అన్నారు. సితార ఎంటర్టయిన్ మెంట్స్ బ్యానర్లో వస్తున్న 'డీజే టిల్లు' ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో నాగవంశీ ఈ వ్యాఖ్యలు చేశారు.
పవన్, రానా ముఖ్యపాత్రల్లో నటించిన భీమ్లా నాయక్ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకుడు. మలయాళంలో హిట్టయిన అయ్యప్పనుమ్ కోషియుమ్ చిత్రానికి ఇది రీమేక్. ఇందులో పవన్ కల్యాణ్ ఓ పవర్ ఫుల్ పోలీస్ అధికారి పాత్ర పోషించారు.