Tripura woman: ఉద్యోగాల ఆశ చూపి.. బాలికలను వ్యభిచార రొంపిలోకి దింపిన మహిళ!
- త్రిపురకు చెందిన మహిళ అఘాయిత్యం
- చెన్నైకు తీసుకొచ్చి బలవంతంగా వ్యభిచారం
- అరెస్ట్ చేసిన పోలీసులు
బాలికల అవసరాన్ని అవకాశంగా తీసుకుని, వారిని వ్యభిచార రొంపిలోకి బలవంతంగా దింపిన దారుణ ఘటన తమిళనాడులో వెలుగు చూసింది. నిందితురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ వివరాలలోకి వెళితే.. త్రిపుర రాష్ట్రంలోని సునాముఖి గ్రామానికి చెందిన చలేమ ఖాటున్, తన భర్త అన్వర్ హుస్సేన్ తో కలసి 14-17 ఏళ్ల వయసున్న నలుగురు బాలికలను చెన్నైకు తీసుకొచ్చింది.
ఆసుపత్రులు, మసాజ్ సెంటర్లలో ఉద్యోగాలు ఇప్పిస్తామని వారికి చెప్పింది. జనవరి 17న చెన్నైకు చేరుకున్న వెంటనే వారిని ఓ అద్దె ఇంట్లో బంధించారు. చలేమ సహాయకులు అల్లా వుద్దీన్, మోయినుద్దీన్, అలంఘిర్ హుస్సేన్.. బాలికలను హింసించి, బెదిరించి వారిపై అత్యాచారానికి పాల్పడ్డారు. దాన్ని వీడియో తీసి బెదిరించారు.
వారితో బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్న వ్యవహారం జనవరి 26న పోలీసులకు తెలిసింది. దీంతో కేలంబాక్కం పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లారు. అయితే, నిందితుల నుంచి లంచం తీసుకుని వారిని విడిచిపెట్టారు. దీంతో ఆ ముఠా బెంగళూరుకు బాలికలను తరలించే ప్రయత్నం చేసింది. ఓ బాలిక తప్పించుకుని పోలీసులను ఆశ్రయించడంతో దారుణానికి బ్రేక్ పడింది.
విధులను నిర్లక్ష్యం చేసిన నలుగురు కానిస్టేబుళ్లను ఉన్నతాధికారులు బదిలీ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితురాలిని అరెస్ట్ చేయగా, మిగిలిన వారు పరారీలో ఉన్నారు. బాధిత బాలికలను సంరక్షణ కేంద్రానికి తరలించారు.