Hindu Mahasabha: గాంధీ వర్ధంతి నాడు గాడ్సేకి నివాళులు అర్పించిన హిందూ మహాసభ
- గాంధీని హత్య చేసిన గాడ్సే
- గాడ్సేకి సహకారం అందించిన ఆప్టే
- 1948 జనవరి 30న గాడ్సే, ఆప్టే అరెస్ట్
- నిరసన తెలుపుతున్నామన్న హిందూ మహాసభ నేతలు
యావత్ భారతదేశం మహాత్మా గాంధీ వర్ధంతికి నివాళులు అర్పిస్తున్న తరుణంలో హిందూ మహాసభ విరుద్ధంగా వ్యవహరించింది. గాంధీని చంపిన నాథూరామ్ గాడ్సేకి ఘన నివాళులు అర్పించింది. గాంధీ హత్యలో గాడ్సేకు సహకరించిన నారాయణ్ ఆప్టేకి కూడా హిందూ మహాసభ నివాళులు అర్పించింది. సరిగ్గా గాంధీ వర్ధంతి నాడే మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో 'గాడ్సే-ఆప్టే స్మృతి దివస్' పేరిట సంస్మరణ కార్యక్రమాన్ని నిర్వహించింది.
దీనిపై హిందూ మహాసభ జాతీయ ఉపాధ్యక్షుడు జైవీర్ భరద్వాజ్ ఫోన్ ద్వారా మీడియాతో మాట్లాడుతూ, జనవరి 30వ తేదీని తాము గాడ్సే-ఆప్టే స్మృతి దివస్ గా జరుపుకుంటున్నామని వెల్లడించారు. 1948 జనవరి 30న వారిద్దరిని అరెస్ట్ చేశారని, అందుకు నిరసనగా తాము స్మృతి దివస్ ను పాటిస్తున్నామని తెలిపారు.
అంతేకాదు, హిందూ మహాసభ సందర్భంగా 'గాడ్సే-ఆప్టే భారతరత్న' పేరిట కొత్త అవార్డుకు కూడా నాంది పలికింది. గత డిసెంబరులో మహాత్ముడిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి జైలుపాలైన ఆధ్యాత్మిక నేత కాళీచరణ్ మహారాజ్, మరో నలుగురు నేతలను ఈ 'గాడ్సే-ఆప్టే భారతరత్న' అవార్డుతో సత్కరించినట్టు జైవీర్ భరద్వాజ్ ప్రకటించారు.