Telangana: తెలంగాణలోని రైతు సంక్షేమ పథకాల అమలుకు స్టాలిన్ మొగ్గు: పసుపు రైతుల సంఘం తెలంగాణ అధ్యక్షుడు
- చెన్నైలో దక్షిణాది రాష్ట్రాల రైతు సంఘాల సమావేశం
- తెలంగాణాలో అమలవుతున్న రైతు సంక్షేమ పథకాలపై చర్చ
- తెలంగాణ పథకాలపై ఆసక్తి కనబరిచిన స్టాలిన్
తమిళనాడు రాజధాని చెన్నైలో నిన్న దక్షిణాది రాష్ట్రాల రైతు సంఘాల సమావేశం జరిగింది. తెలంగాణ పసుపు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోటపాటి నరసింహనాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తెలంగాణలో అమలవుతున్న రైతు సంక్షేమ పథకాలైన రైతుబంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్, నీటి పారుదల ప్రాజెక్టులపై చర్చించారు.
అనంతరం తమళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ను కలిసిన కోటపాటి తెలంగాణలో విజయవంతంగా అమలవుతున్న రైతు సంక్షేమ పథకాల గురించి వివరించారు. వాటికి ఆకర్షితులైన సీఎం స్టాలిన్ తాము కూడా తెలంగాణలో అమలవుతున్న రైతు సంక్షేమ పథకాలను అమలు చేస్తామని చెప్పినట్టు కోటపాటి తెలిపారు.
కాగా, ఈ సమావేశంలో పసుపు రైతుల సంఘం జాతీయ అధ్యక్షుడు పీకే దైవశిగామణి, రాష్ట్రీయ కిసాన్ సంఘ్ కర్ణాటక శాఖ అధ్యక్షుడు శాంతకుమార్, కేరళ శాఖ అధ్యక్షుడు జాన్, తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు రామ గౌండర్, పుదుచ్చేరి వ్యవసాయ సంఘం అధ్యక్షుడు నికోలస్ తదితరులు పాల్గొన్నారు.