Flying Car: ఎగిరే కారు వచ్చేస్తోంది... పైలెట్ లైసెన్స్ తప్పనిసరి!
- స్లొవేకియా పరిశోధకుల అద్భుత సృష్టి
- రోడ్డుపై కారులా ప్రయాణం
- రెక్కలు విప్పుకుంటే వాయు విహారం
- మరో ఏడాదిలో వాణిజ్యపరమైన ఉత్పత్తి
టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న ఇప్పటిరోజుల్లో అసాధ్యమనేది లేకుండా పోతోంది. తాజాగా స్లొవేకియా పరిశోధకులు ఎగిరేకారుకు రూపకల్పన చేశారు. ఇది కారులా రోడ్డుపై ప్రయాణించగలదు, రెక్కలు విప్పుకుని గాల్లోనూ ఎగరగలదు. తాజాగా ఈ ఎయిర్ కార్ గగన విహారానికి స్లొవేకియాలో అనుమతులు లభించాయి. అన్నిరకాల ఫ్లయిట్ టెస్టులు విజయవంతంగా పూర్తి చేసుకోవడంతో స్లొవేకియా రవాణా శాఖ అనుమతి ఇచ్చింది.
ఈ ఎయిర్ కార్ పరిశీలన నిమిత్తం 70 గంటల పాటు గాల్లో ఎగిరింది. ఈ కార్ ప్లేన్ ను క్లీన్ విజన్ అనే సంస్థ అభివృద్ధి చేసింది. పరీక్షల్లో భాగంగా ఇది 200 పర్యాయాలు టేకాఫ్ లు, ల్యాండింగ్ లు ప్రదర్శించింది. తమ హైబ్రిడ్ వాహనం యూరోపియన్ ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీ (ఈఏఎస్ఏ) ప్రమాణాలను అందుకుందని క్లీన్ విజన్ వెల్లడించింది. అయితే ఈ ఎయిర్ కార్ ను నడపాలంటే ప్రత్యేకంగా పైలెట్ లైసెన్స్ అవసరం.
ఈ నెక్ట్స్ జనరేషన్ కారు మరో 12 నెలల్లో వాణిజ్యపరంగా అందుబాటులోకి రానుందని కంపెనీ ప్రతినిధి తెలిపారు. ఈ ఎయిర్ కారులో 1.6 లీటర్ బీఎండబ్ల్యూ ఇంజిన్ అమర్చారు. దీనికి సాధారణ ఇంధనం (కంప్రెస్డ్ గ్యాస్) సరిపోతుందని క్లీన్ విజన్ సహ వ్యవస్థాపకుడు ఆంటోన్ జజాక్ వెల్లడించారు. ఈ హైబ్రిడ్ వాహనం గాల్లో అత్యధికంగా 18 వేల అడుగుల ఎత్తున ప్రయాణించగలదని చెప్పారు.