Kerala: కరోనా మూడో వేవ్ లో.. కేరళలోనే ఎక్కువ మరణాలు!
- ఈ నెల 1-26 మధ్య 5,25,245 కేసులు
- మరణాలు 790
- మహారాష్ట్రలో కేసులు 9,17,190
- కానీ, మృతులు 783 మంది
కేరళ విద్యావంతుల రాష్ట్రం. మెరుగైన వైద్య సదుపాయాలకూ వేదికే. ఎందుకో గానీ, విద్యాధికుల రాష్ట్రం అధిక కరోనా కేసులతో సతమతం అవుతోంది. మరీ ముఖ్యంగా కరోనా మూడో విడతలో ఈ ఏడాది జనవరిలో ఎక్కువ మరణాల రేటు కేరళ రాష్ట్రంలోనే నమోదైనట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
దేశవ్యాప్తంగా కరోనా ఒమిక్రాన్ కేసులు గణనీయంగా పెరగడం తెలిసిందే. జనవరి 1 నుంచి 26వ తేదీ వరకు కేరళలో 5,25,245 మంది ఇన్ఫెక్షన్ కు గురయ్యారు. 790 మరణాలు నమోదయ్యాయి. పొరుగు రాష్ట్రాల్లో కేసులు కూడా ఇంచుమించు ఇదే స్థాయిలో ఉన్నప్పటికీ, మరణాలు కేరళ కంటే తక్కువగా ఉండడాన్ని గమనించాలి. ప్రస్తుతం రోజువారీ సగటున 50,000 కేసులు కేరళలో నమోదవుతున్నాయి.
మహారాష్ట్రంలో చూస్తే ఈ నెల 1 నుంచి 26 తేదీల వరకు 9,17,190 కేసులు నమోదయ్యాయి. అంటే కేరళ కంటే రెట్టింపు కేసులు మహారాష్ట్రలో వచ్చాయి. కానీ మరణించిన వారి సంఖ్య 783 మాత్రమే. కేరళ కంటే కేసులు రెట్టింపు స్థాయిలో ఉన్నప్పటికీ, మరణాలు మాత్రం అంతగా లేకపోవడాన్ని గమనించాలి.