F-35: దక్షిణ చైనా సముద్రంలో కూలిపోయిన ఎఫ్-35 యుద్ధ విమానం... ఆందోళనలో అమెరికా
- ఎఫ్-35 యుద్ధ విమానంలో స్టెల్త్ పరిజ్ఞానం
- సునిశిత దాడుల కోసం లింకింగ్ నెట్వర్క్ సెన్సర్లు
- సెన్సర్లు చైనాకు దొరక్కూడదని కోరుకుంటున్న అమెరికా
- శకలాల గుర్తింపు చర్యలు ముమ్మరం
అమెరికా అమ్ములపొదిలో ఉన్న ఎఫ్-35 యుద్ధ విమానం పూర్తిగా స్టెల్త్ పరిజ్ఞానంతో రూపొందించారు. ఈ యుద్ధ విమానం ఎంతో గుట్టుగా ప్రయాణిస్తుంది. ఈ విమానం ఏదైనా ఒక దేశం మీదుగా వెళితే, ఆ సంగతిని ఆ దేశ రాడార్లు కూడా గుర్తించలేవు. అందుకే దీన్ని అమెరికా అత్యంత భద్రంగా చూసుకుంటుంది.
గతంలో ఈ ఎఫ్-35 యుద్ధ విమానం మెడిటెర్రేనియన్ సముద్రంలో కూలిపోతే అమెరికా చేసిన హడావిడి అంతాఇంతా కాదు. తమ విమాన శకలాలు ఎక్కడ రష్యన్ల చేతిలోకి వెళతాయోనని విపరీతంగా ఆందోళనకు గురైంది. ఆగమేఘాలపై సముద్రాన్ని శోధించి తన విమాన శకలాలను సేకరించింది. ఇప్పుడు మళ్లీ అమెరికాకు అలాంటి సమస్యే ఎదురైంది. మరోసారి ఎఫ్-35 యుద్ధ విమానం కూలిపోయింది.
ఈసారి దక్షిణ చైనా సముద్రంలో కూలిపోవడం అమెరికాను మరింత ఇబ్బందికర వాతావరణంలోకి నెట్టింది. దక్షిణ చైనా సముద్రంపై చైనా ఆధిపత్యం ప్రదర్శిస్తుండడం తెలిసిందే. ఈ శకలాలు చైనా దళాలకు దొరక్క ముందే శకలాల గుర్తింపు, సేకరణ పూర్తిచేయాలని అమెరికా తలపోస్తోంది.
తాజాగా కూలిపోయిన విమానం యూఎస్ఎస్ కార్ల్ విన్సన్ విమాన వాహక నౌక నుంచి కార్యకలాపాలు సాగిస్తుంది. ఈ విమానంలో ఉన్నంత అత్యాధునిక సాంకేతిక వ్యవస్థలు చైనా వద్ద కూడా లేవు. సరిగ్గా చెప్పాలంటే ఈ యుద్ధ విమానాన్ని ఫ్లయింగ్ కంప్యూటర్ అంటారు. ఈ విమానం సేకరించిన డేటాను ఇతర ఆయుధ వ్యవస్థలతో పంచుకుని, అత్యంత కచ్చితత్వంతో దాడి చేయగలదు. అందుకోసం ప్రత్యేకంగా లింకింగ్ నెట్వర్క్ సెన్సర్లను ఇందులో ఏర్పాటు చేశారు.
ఈ సెన్సర్లను చైనా చేజిక్కించుకుంటే ఏం జరుగుతుందో అమెరికాకు తెలియంది కాదు. అచ్చం అలాంటివే తయారుచేసి తన యుద్ధ విమానాలను మరింత శక్తిమంతం చేసుకుంటుంది. అప్పుడు ఆయుధ రంగంలో అమెరికాకు దీటుగా నిలుస్తుంది. అందుకే చైనాకు ఎఫ్-35 శకలాలు దొరకరాదని, డ్రాగన్ కంటే ముందే శకలాలు ఉన్న ప్రాంతాన్ని గుర్తించాలని అమెరికా బలంగా కోరుకుంటోంది.