Harbhajan Singh: కుల్ దీప్ యాదవ్ కు కష్టమే: హర్భజన్ సింగ్
- వెస్టిండీస్ తో జరిగే వన్డే సిరీస్ కు ఎంపికైన కుల్ దీప్ యాదవ్
- ప్రాక్టీస్ లేకుండానే బరిలోకి దిగుతున్నాడన్న హర్భజన్
- ఇది ఆయనకు కష్టంగా మారుతుందని వ్యాఖ్య
టీమిండియా వన్డే జట్టులోకి స్పిన్నర్ కుల్ దీప్ యాదవ్ తిరిగొచ్చిన సంగతి తెలిసిందే. సొంతగడ్డపై వెస్టిండీస్ తో జరిగే వన్డే సిరీస్ కు ఆయన ఎంపికయ్యాడు. అయితే కుల్ దీప్ యాదవ్ కు అంత ఈజీగా ఉండదని మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ అన్నారు.
ఎలాంటి ప్రాక్టీస్ లేకుండానే కుల్ దీప్ బరిలోకి దిగుతున్నాడని... ఇది ఆయనకు చాలా కష్టంగా మారుతుందని చెప్పారు. గత కొంత కాలంగా కుల్ దీప్ దేశవాళీ మ్యాచ్ లు ఆడలేదని... ప్రాక్టీస్ లేకుండా అంతర్జాతీయ మ్యాచ్ లలో రాణించడం అంత సులువు కాదని అన్నారు. మోకాలి ఆపరేషన్ కు ముందు కూడా ఆయన క్రమం తప్పకుండా అన్ని మ్యాచ్ లలో వరుసగా ఆడలేదని చెప్పారు.
లిమిటెడ్ ఓవర్స్ మ్యాచ్ లో ఆడేటప్పుడు ఓ బౌలర్ మెదడులో వచ్చే తొలి ఆలోచన తన ఓవర్లో అవతలి బ్యాట్స్ మెన్ బాదకూడదనేదని హర్భజన్ అన్నారు. ఇది బౌలర్ మానసిక దృఢత్వానికి ఒక పరీక్ష వంటిదని అన్నారు. ముందు ఈ పరీక్షను జయించాల్సి ఉంటుందని చెప్పారు.