Devulapalli Subbaraya Sastri: ‘డుంబు’ సృష్టికర్త, ’దేవులపల్లి’ కుమారుడు 'బుజ్జాయి' కన్నుమూత!

Devulapalli Subbaraya Sastri Passed Away At Chennai

  • గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సుబ్బరాయశాస్త్రి 
  • కార్టూన్ ప్రపంచంలో ‘డుంబు’ను పరిచయం చేసిన శాస్త్రి 
  • అడవి బాపిరాజు, మొక్కపాటి వంటి ఉద్దండుల వద్ద మెళకువలు

ప్రముఖ కవి దేవులపల్లి కృష్ణశాస్త్రి కుమారుడు, ‘డుంబు’ పాత్ర సృష్టికర్త దేవులపల్లి సుబ్బరాయశాస్త్రి కన్నుమూశారు. ఆయన వయసు 91 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గత రాత్రి చెన్నైలోని ఆయన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు.

తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో జన్మించిన సుబ్బరాయశాస్త్రికి చిన్నతనం నుంచే చిత్రలేఖనంపై మక్కువ ఉండేది. దాంతో అడవి బాపిరాజు, మొక్కపాటి, పిలకా, గోఖలే వంటి దిగ్గజాల వద్ద చిత్రలేఖనంలో మెళకువలు నేర్చుకున్నారు. తన కార్టూన్లతో ‘బుజ్జాయి’గా చిరపరిచితుడైన ఆయన దేశానికి ఓ సరికొత్త కామిక్ కథల్ని పరిచయం చేశారు. గురజాడ అప్పారావు రచించిన కన్యాశుల్కం నాటకాన్ని బొమ్మల ద్వారా పాఠకులకు పరిచయం చేశారు.

ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి వారపత్రిక, ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా వంటి వాటిలో ఆరు దశాబ్దాలకుపైగా పనిచేశారు. 17 ఏళ్ల వయసులోనే ‘బానిస పిల్ల’ పేరుతో 30 పేజీల బొమ్మల కథా పుస్తకాన్ని ప్రచురించారు. 1963లో ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా’లో ‘పంచతంత్రం’ ఐదేళ్లపాటు ధారావాహికగా ప్రచురితమై జాతీయ స్థాయిలో ఎనలేని పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చింది.

ఇక ‘డుంబు’ అనే కార్టూన్ పాత్రను సృష్టించి దాని పేరుతో 1954లో ఆంధ్రప్రభలో సీరియల్ నిర్వహించారు. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, ఇంగ్లిష్ భాషల్లో 100కుపైగా చిన్నారుల కామిక్స్, కథల పుస్తకాలు ముద్రించారు. 1992లో ఏపీ ప్రభుత్వం ‘బాలబంధు’ బిరుదుతో సుబ్బరాయశాస్త్రిని సత్కరించింది.

  • Loading...

More Telugu News