Kapil Sibal: కాంగ్రెస్ కు ఆజాద్ సేవలు అవసరం లేకపోవడం విడ్డూరం: పార్టీ తీరును ఎండగట్టిన కపిల్ సిబాల్

Ironic that Congress does not need his services Kapil Sibal

  • భాయిజాన్ కు అభినందనలు
  • యావత్ దేశం ఆజాద్ సేవలను గుర్తిస్తోంది
  • పార్టీకి మాత్రం ఆయన అవసరం లేనట్టుంది
  • ఇది విడ్డూరంగా ఉందంటూ కపిల్ సిబాల్ విమర్శలు 

కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను వెల్లడించే ‘గ్రూపు 23’లో భాగమైన కపిల్ సిబాల్ మరోసారి పార్టీ తీరును తప్పుబట్టారు. పరోక్షంగా విమర్శలు కురిపించారు. ప్రజా జీవితంలో కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ చేసిన సేవలను గుర్తిస్తూ ప్రభుత్వం ఆయనకు పద్మభూషణ్ అవార్డును ప్రకటించడం తెలిసిందే. అలాగే పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, సీపీఎం నేత బుద్ధదేవ్ భట్టాచార్యకు కూడా పద్మభూషణ్ ప్రకటించడం జరిగింది.

అయితే, తాము ప్రజా సేవ కోసమే వచ్చామని, అవార్డుల కోసం కాదంటూ బుద్ధదేవ్ భట్టాచార్య పద్మభూషణ్ అవార్డును తిరస్కరించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరామ్ రమేశ్ దీన్ని సమర్థిస్తూ చేసిన ట్వీట్ వివాదానికి దారితీసింది. బుద్ధదేవ్ భట్టాచార్య ప్రకటనను జైరామ్ రమేశ్ ట్వీట్ చేస్తూ.. ‘ఇది సరైన పని. ఆయన అజాద్ గా ఉండాలనుకుంటున్నారు. గులామ్ లా కాదు’ అంటూ వెటకారంగా ట్వీట్ చేశారు. తద్వారా గులాంనబీ ఆజాద్ స్పందించకపోవడాన్ని ఎద్దేవా చేశారు.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబాల్ స్పందించారు. దేశం ఆయన సేవలను గుర్తిస్తుంటే, కాంగ్రెస్ పార్టీకి మాత్రం గులాంనబీ ఆజాద్ సేవలు అవసరం లేనట్టుందన్నారు. ‘‘గులాంనబీ ఆజాద్ కు పద్మభూషణ్ పురస్కారం లభించింది. అభినందనలు భాయిజాన్. ప్రజా జీవితంలో ఆయన సేవలను దేశం గుర్తిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీకి గులామ్ నబీ ఆజాద్ సేవలు అవసరం లేకపోవడం విడ్డూరంగా ఉంది’’ అని కపిల్ సిబాల్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News