Arun Singh: అధికారంలోకి రావడం కోసం 3 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన జగన్.. సీఎం అయ్యాక జనాల్లోకి రావడం లేదు: బీజేపీ నేత అరుణ్ సింగ్
- ఎంపీ, ఎమ్మెల్యేలను కూడా కలవడం లేదు
- మోదీ పథకాలకు జగన్ తన లేబుల్ వేసుకుంటున్నారు
- బీజేపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారు
ఉత్తరప్రదేశ్ లో సమాజ్ వాదీ పార్టీ పాలన ఉన్నప్పుడు మతదాడులు జరిగేవని... దాంతో 2017లో ఎస్పీ ప్రభుత్వానికి ప్రజలు ముగింపు పలికారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ అన్నారు. ఈ విషయాన్ని ఏపీ ముఖ్యమంత్రి జగన్ కూడా గుర్తుంచుకోవాలని... లేకపోతే ఇక్కడ కూడా వైసీపీని గద్దె దింపి, బీజేపీని ప్రజలు అధికారపీఠంపై కూర్చోబెడతారని చెప్పారు. ఏపీలో పోలీస్ స్టేషన్లపై దాడి చేసిన వారిపై తక్కువ చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం... బీజేపీ నేతలపై మాత్రం తప్పుడు కేసులు పెట్టిస్తోందని విమర్శించారు.
అధికారంలోకి రావడం కోసం 3 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన జగన్... సీఎం అయిన తర్వాత జనంలోకి రావడం లేదని అరుణ్ సింగ్ దుయ్యబట్టారు. ఎంపీ, ఎమ్మెల్యేలను కూడా జగన్ కలవడం లేదని విమర్శించారు. మోదీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుంటే... జగన్ తన లేబుల్ వేసుకుని ప్రచారం చేసుకుంటున్నారని అన్నారు. కర్నూలులో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.