IPL-2022: ఐపీఎల్ లో ఈసారి నిజంగా మెగా వేలం... బరిలో 1200 మందికి పైగా ఆటగాళ్లు
- ఫిబ్రవరిలో ఐపీఎల్ వేలం
- 12, 13 తేదీల్లో బెంగళూరు వేదికగా వేలం
- వేలానికి 318 మంది విదేశీ క్రికెటర్లు
- జనవరి 20తో ముగిసిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రపంచంలో మరే లీగ్ అందించనంత ఎక్కువ మొత్తంలో ఆటగాళ్లకు ముట్టచెబుతుంది. అందుకే ఆటగాళ్లలో ఐపీఎల్ కు అంత డిమాండ్. ఈ ఏడాది వేలం కోసం భారీ సంఖ్యలో ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఫిబ్రవరి 12, 13 తేదీల్లో బెంగళూరు వేదికగా మెగా వేలం నిర్వహించనున్నారు.
రిజిస్ట్రేషన్లకు తుది గడువు జనవరి 20వ తేదీ కాగా, మొత్తం 1,214 మంది ఆటగాళ్లు ఐపీఎల్ వేలం కోసం తమ పేర్లు నమోదు చేయించుకున్నారు. ఇందులో 318 మంది విదేశీ ఆటగాళ్లు. వీరిలో అత్యధికంగా ఆస్ట్రేలియాకు చెందినవాళ్లే 59 మంది ఉన్నారు.
ఇక భారత దేశవాళీ క్రికెటర్లు కూడా ఈసారి ఎక్కువ మంది వేలానికి వస్తున్నారు. 903 మంది అన్ క్యాప్డ్ ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈసారి ఐపీఎల్ బరిలో రెండు కొత్త జట్లు (అహ్మదాబాద్, లక్నో) కూడా ఉండడంతో వేలం రసవత్తరంగా సాగుతుందనడంలో సందేహం లేదు. ఈ రెండు ఫ్రాంచైజీలు కీలక ఆటగాళ్లను కొనుగోలు చేసినప్పటికీ, జట్టు నిర్మాణం కోసం వేలంలో భారీ మొత్తంలో వెచ్చించే అవకాశాలున్నాయి.