: చైనా భాషలో గాంధీ సిద్ధాంతం!
తుపాకీతోనే రాజ్యాధికారం సిద్ధిస్తుంది అనే మావో జెడాంగ్ ఆలోచనలు అధికంగా ఉన్న కమ్యూనిస్టు దేశమైన చైనా ఇప్పుడు గాంధేయవాద సిద్ధాంతాలవైపు దృష్టి సారించనుంది. చైనా అధికార భాషలో గాంధీ సిద్ధాంతాలకు సంబంధించిన పుస్తకం ఆ దేశంలో అధికారికంగా విడుదలైంది. మహాత్ముడి విధానాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందాయి. అయితే అధికారిక అనుమతితో, ప్రపంచ స్థాయి హక్కులతో చైనీస్ అధికార భాష మాండరిన్‌లో పుస్తకం విడుదల కావడం ఇదే ప్రథమం అని భారత అధికారులు అంటున్నారు.
గతంలో భారత దౌత్యవేత్తగా పనిచేసిన గాంధేయవాది పాస్కల్ అలన్ నజరత్ ఆంగ్లంలో 'గాంధీ అసాధారణ నాయకత్వం' పేరుతో ఒక పుస్తకాన్ని రచించారు. ఆయన రచించిన పుస్తకాన్ని పెకింగ్ విశ్వవిద్యాలయంలో చరిత్ర ఆచార్యుడుగా పనిచేస్తున్న షాంగ్ క్వాన్‌యు చైనా అధికార భాష మాండరిన్‌లోకి అనువదించారు. ఈ పుస్తకాన్ని సోమవారం నాడు పెకింగ్ విశ్వవిద్యాలయంలోని 'సెంటర్ ఫర్ ఇండియా స్టడీస్'లో భారత రాయబారి ఎస్.జయశంకర్ సమక్షంలో నజరత్ ఆవిష్కరించారు. ఈ పుస్తకం ద్వారా గాంధీ ఆలోచనలు చైనాలో అధికారికంగా ప్రవేశించడంగా భారత దౌత్యాధికారులు వ్యాఖ్యానించారు. ఈ పుస్తకం గురించి రచయిత మాట్లాడుతూ, గాంధీ ఆలోచనలు ప్రపంచానికి ఎంతైనా అవసరమని, ముఖ్యంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్ధిక వ్యవస్థ కలిగిన చైనా లాంటి దేశాల్లో మితిమీరిన వినియోగదారిత్వం వల్ల సమాజంపై హానికరమైన ప్రభావం చూపుతోందని, ఇలాంటి పరిస్థితుల్లో చైనాకు గాంధీ తత్వం ఎంతైనా అవసరమని భావిస్తున్నట్టు చెప్పారు. మావో జెడాంగ్ సిద్ధాంతాలకు, గాంధీ అహింసాయుత సిద్ధాంతాలకు మధ్య గల వైరుధ్యాలను రచయిత ప్రస్తావిస్తూ, గాంధీతత్వం భవిష్యత్తులో ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత మెరుగుపరచడానికి దోహదపడుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.