Andhra Pradesh: గృహహింస కేసు.. కోడలికి కోటి రూపాయల పరిహారం చెల్లించాలంటూ బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ కుటుంబానికి కోర్టు ఆదేశం

Give one crore as compensation to daugher in law vijayawada court orders ap bjp leader kanna

  • 2006లో కన్నా కుమారుడు నాగరాజుతో శ్రీలక్ష్మి కీర్తి ప్రేమ వివాహం
  • 2015 తర్వాత అత్త నుంచి వేధింపులు
  • కన్నా కుటుంబం నుంచి రక్షణ కల్పిస్తామని కోర్టు హామీ
  • వారి ఇంట్లోనే నివాస వసతి కల్పించాలని ఆదేశం
  • లేని పక్షంలో నెలకు రూ. 50 వేలు చెల్లించాలన్న కోర్టు
  • మూడు నెలల్లోగా పరిహారం చెల్లించకుంటే 12 శాతం వడ్డీ

కోడలు పెట్టిన గృహ హింస కేసులో ఏపీ బీజేపీ మాజీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ కుటుంబానికి ఎదురుదెబ్బ తగిలింది. కోడలు శ్రీలక్ష్మి కీర్తికి కోటి రూపాయల పరిహారం చెల్లించాలని విజయవాడ ఒకటో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ న్యాయస్థానం ఆదేశించింది.

వివరాలలోకి వెళితే... శ్రీలక్ష్మి కీర్తికి కన్నా కుమారుడు నాగరాజుతో 10 మే 2006లో ప్రేమ వివాహం జరిగింది. వీరికి కుమార్తె కౌషిక మానస ఉంది. 2015 వరకు అందరూ కలిసే ఉన్నారు. ఆ తర్వాతి నుంచి తనకు వేధింపులు మొదలయ్యాయని, అత్త విజయలక్ష్మి తనను సూటిపోటి మాటలతో వేధించేవారని శ్రీలక్ష్మి తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

తనను కాకుండా వేరొకరిని పెళ్లి చేసుకుంటే కోట్ల రూపాయల ఆస్తులు వచ్చి ఉండేవంటూ వేధించేవారని, తన భర్త కూడా మరో మహిళతో సంబంధం పెట్టుకుని తనను వేధించారని ఆరోపించారు. ఈ విషయాన్ని ప్రశ్నించిన తనపై 29 మార్చి 2015న దాడిచేశారని పేర్కొన్నారు. తనకు, తన కుమార్తెకు రక్షణ కల్పించడమే కాకుండా నివాస వసతి కల్పించాలని, వైద్య ఖర్చులు ఇప్పించాలని కోరుతూ భర్త నాగరాజు, మామ కన్నా లక్ష్మీనారాయణ, అత్త విజయలక్ష్మిలపై కోర్టులో కేసు వేశారు.

తాజాగా, ఈ కేసులో తుది తీర్పు వెలువడింది. నాగరాజు, లక్ష్మీనారాయణ, విజయలక్ష్మి నుంచి రక్షణ కల్పిస్తామని, ఆమె నివాస పరిధిలోని పోలీస్ స్టేషన్‌లో ఈ ఆర్డర్ కాపీ ఇవ్వాలని న్యాయమూర్తి వెంకట శివ సూర్యప్రకాశ్ ఆదేశించారు. అంతేకాదు, పిటిషనర్ శ్రీలక్ష్మి, ఆమె కుమార్తెకు ప్రతివాదులైన కన్నా లక్ష్మీనారాయణ ఇంటిలో నివాస వసతి కల్పించాలని ఆదేశించారు.

అలా ఇవ్వలేని పక్షంలో ప్రత్యామ్నాయ వసతి కోసం నెలకు రూ. 50 వేలు చెల్లించాలని, కుమార్తె వైద్య ఖర్చుల కోసం చేసిన ఖర్చుల నిమిత్తం రూ. 50 వేలు చెల్లించాలని ఆదేశించడంతోపాటు, ప్రతివాదులు ముగ్గురు నష్టపరిహారం కింద శ్రీలక్ష్మి కీర్తికి కోటి రూపాయలు ఇవ్వాలని ఆదేశించారు. వీటన్నింటిని మూడు నెలల్లోపు చెల్లించాలని, ఆలస్యమైన పక్షంలో 12 శాతం వడ్డీతో చెల్లించాలని కోర్టు ఆదేశించింది.

  • Loading...

More Telugu News